Kavitha New Office: తెలంగాణ జాగృతికి కొత్త కార్యాలయం - కేసీఆర్‌కు నోటీసులకు వ్యతిరేకంగా నిరసనలు - దూకుడుగా కవిత
Telangana Jagruti: తెలంగాణ జాగృతికి కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభిస్తున్నారు. అలాగే జూన్ నాలుగో తేదీన నిరసనలకు పిలుపునిచ్చారు.

Telangana Jagruti Kavitha New Office: కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం మధ్య కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్ ఓ రాజకీయ పార్టీని నిర్వహించడానికి అవసరమైనంత పెద్ద భవనంలో తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి శాఖల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. సింగరేణి పరిధిలోని పదకొండు డివిజన్లకు కార్యదర్శిలను నియమించారు.
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై నిరసనలకు పిలుపు
మరో వైపు కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత నిరసనలకు పిలుపునిచ్చారు. ఐదో తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు నిరసనగా నాలుగోతేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు. అయితే ఈ నిరసనలకు బీఆర్ఎస్ మద్దతు లేదు.త కవిత కూడా బీఆర్ఎస్ తరపున పిలుపునివ్వలేదు. తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండానే నిరసనలు నిర్వహిస్తున్నారు.
దూరం పెట్టిన బీఆర్ఎస్ - జాగృతి క్యాడర్ తోనే కవిత కార్యక్రమాలు
కవిత ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదు. ఆమెతో సమావేశం అయ్యేందుకు రావడం లేదు. కవిత పూర్తిగా జాగృతి క్యాడర్, అనుచరులతోనే ప్రస్తుతానికి సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. కేటీఆర్ ఓ ట్వీట్ వేసి ఊరుకున్నారని అదే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వస్తే మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చారని కవిత రెండు రోజుల కిందట మీడియా చిట్ చాట్ లో విమర్శిచారు. ఇప్పుడు కేసీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు.
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం...@RaoKavitha pic.twitter.com/vMoL0bbDSa
— Mahendra Maheshwaram (Chanti) (@chantimaheshwa2) May 31, 2025
కవిత నిరసనల్లో బీఆర్ఎస్ క్యాడర్ పాల్గొంటుందా?
కవిత నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కు వచ్చిన కాళేశ్వరం కమిషన్ నోటీసుల గురించి ఎవరూ పెద్దగా స్పందించలేదు. నిరసనల దాకా ఆలోచించలేదు. తండ్రి కేసీఆర్‌పై తనకు లెక్క లేనంత అభిమానం ఉందని కేటీఆర్ కే లేదని కవిత నిరూపించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నోటీసుల వ్యవహారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నాలుగో తేదీన ఆమె పిలుపు మేరకు ఎంత మంది నిరసనలు చేస్తారన్నదాన్ని బట్టి క్షేత్ర స్థాయిలో ఆమె బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. కేసీఆర్ కోసం చేస్తున్నప్పటికీ ఈ నిరసనల్లో బీఆర్ఎస్ క్యాడర్ పాల్గొనే అవకాశం లేదు. ఈ అంశం కూడా ఆమెకు కలసి వచ్చే అవకాశం ఉంది.






















