Nagasadhu Aghori Arrest: వివాదాస్పద నాగసాధు అఘోరిని అదుపులోకి తీసుకున్న సిరిసిల్ల పోలీసులు
Aghori Arrested | వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానంటూ బయలుదేరిన మహిళా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sircilla police arrests Naga Sadhu Aghori | సిరిసిల్ల: గత కొన్ని రోజులుగా తెలంగాణలో హల్ చల్ చేస్తున్న మహిళా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్నం వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని మహిళా అఘోరి శపథం చేయడం తెలిసిందే. తన శపథం నెరవేర్చుకోవడానికి సోమవారం రాత్రి వేములవాడకు వస్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడ వైపు కారులో వస్తున్న అఘోరిని తంగళ్ళపల్లి మండలం జిల్లెల శివారులో పోలీసులు ఆపివేశారు.
పోలీసుల మాట వినలేదని..
ప్రయత్నాలు మానుకోవాలని పోలీసులు చెప్పినా మహిళా అఘోరి వినలేదు. తన శపథం నేరవేర్చుకోవాలని, తనను వదిలిపెట్టాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే చెప్పినా కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ వైపు తరలించారు. దాంతో దర్గా కూల్చివేత టెన్షన్ తప్పింది. మహిళా అఘోరి అలాంటి పనులు చేస్తే అది మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని.. హిందు, ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయని భావించి పోలీసులు అప్రమత్తం అయ్యారు. దర్గాను కూల్చి వేస్తానని మహిళా అఘోరి శపథం చేసింది. దాంతో అమె వేములవాడ వైపు ఎప్పుడు వస్తుందా అని నిఘా పెట్టడంతో పాటు వేములవాడ నలువైపులా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో మహిళా అఘోరి వేములవాడలోని దర్గా కూల్చివేతకు బయలుదేరిందన్న సమాచారంతో తంగళ్లపల్లి మండలం జిల్లెల ఎంట్రెన్స్ లో పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు.






















