Minister Puvvada Ajay Kumar: వేకువజాము నుంచే ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ పర్యటన.!
Minister Puvvada Ajay Kumar: వేకువజాము నుంచే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మోకాళ్ల లోతు నీటిలో తిరుగుతూ.. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతున్నారు.
Minister Puvvada Ajay Kumar: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా తడిసి ముద్దయింది. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతూ రోడ్లపై ప్రవహిస్తోంది. ప్రతిరోజూ ప్రజాప్రథినిధులు ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకొని మరీ వరద బాధిత ప్రాంతాలకు వెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 24 గంటల్లూ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
వేకువజాము నుంచే పర్యటన..
ఇందులో భాగంగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు వేకువజాము నుంచే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. అలాగే పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో అస్సలే ఉండకూడదని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే స్థానిక అధికారులకు లేదా ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగానే..
గోదావరి వరద ఉద్ధృతి 68 అడుగులకు పెరిగిన దృష్ట్యా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా తమకు సహకరించి వెంటనే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే గోదావరి వరద ఉద్ధృతి ఇంకా పెరిగి 75 అడుగుల వరకు వస్తుందన్న సమాచారం మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణం ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్, శాంతి నగర్, మిథిలా స్టేడియంలో వరుద నీరు చేరడంతో ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు ఇళ్లకు రాకుండా ఉండాలని బాధితులకు వివరించారు. అప్పటి వరకు మీ బాధ్యత మొత్తం మాదేనంటూ భరోసా కల్పించారు.
మోకాళ్ల లోతు నీటిలోనే..
మోకాళ్ల లోతులో నీళ్లలో తిరుగుతూనే మంత్రి పువ్వాడ కుమార్ వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ముంపుకు గురైన వివిధ ప్రాంతాలలో ప్రజలను తక్షణమే తరలించాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడ వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్కోవాలని చెప్పారు. అలాగే భోజన వసతితో పాటు వైద్య శిబిరాలను కూడా అందుబాటులో ఉంచాలని వివరించారు. ప్రజలు కూడా వరద నీటికి అడ్డుగా వెళ్లడం, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవడం వంటివి చేయకూడదని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని మంత్రి పువ్వాడ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఏమైనా నష్టపోతే వారికి ప్రభుత్వం సాయంగా నిలుస్తుందని చెప్పారు. కాబట్టి ప్రజలెవరూ బాధపడకూడదని, భయ పడకూడదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.