Medigadda Barrage Restoration:కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
Medigadda Barrage Restoration: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NDSA ఇచ్చిన సూచనల మేరకు మరమ్మతులు చేపట్టనుంది.

Medigadda Barrage Restoration: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టు, గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ ఒక్క ఘటన కాళేశ్వరం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అంతేకాకుండా రాజకీయ దుమారానికి కారణమైంది. సీబీఐ విచారణకు దారి తీసింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిన ఆ దృశ్యం రాష్ట్ర ప్రజలకు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది కదా.
కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు. కాళేశ్వరం ప్యాకేజీలో భాగమైన అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు (నీరు లీకవ్వడం) బయటపడ్డాయి. ఈ మూడు బ్యారేజీలకు తాత్కాలికంగా రిపేర్లు చేసినప్పటికీ, వీటిలో నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణపై అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకే డిజైన్ల తయారీ
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ఈ మొత్తం ప్రక్రియను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన సూచనల మేరకు చేపట్టాలని నిర్ణయించారు. ఈ బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెండర్ ప్రకటన జారీ చేసింది.
నిపుణుల నివేదిక ఏమి చెప్పింది?
మేడిగడ్డ కుంగిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. దాని ఆధారంగా, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి సీడబ్ల్యూసీ (CWC) మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహించారు.
ఆ కమిటీ గతేడాది మే నెలలోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో బ్యారేజీల నిర్మాణం, డిజైన్లు, నాణ్యత, నిర్వహణ సహా అనేక వైఫల్యాలున్నట్లు స్పష్టంగా గుర్తించింది.
ఆ నివేదిక ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే: ఈ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీల్లేదని, ఒకవేళ అలా చేస్తే మరింత నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. అంతేకాకుండా, బ్యారేజీల పునరుద్ధరణ కోసం పాటించాల్సిన కొన్ని డిజైన్లు డ్రాయింగ్స్ ను కూడా ఈ కమిటీ సూచించింది.
టెండర్ ప్రక్రియలో కీలక వివరాలు
ప్రస్తుతం, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆ నిపుణుల కమిటీ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణ, రెస్టోరేషన్ డిజైన్ల కోసం ప్రసిద్ధ డిజైన్ ఏజెన్సీల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను ఆహ్వానించింది.
ప్రతిపాదనలను సమర్పించడానికి గడువు ఎప్పుడంటే: ఆసక్తి ఉన్న డిజైన్ ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సీల్ చేసిన కవర్లలో అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి సమర్పించాలి.
ఎప్పుడు కవర్లు ఓపెన్ చేస్తారు?
అదే రోజు సాయంత్రం 5 గంటలకు జలసౌధ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ కవర్లు ఓపెన్ చేస్తామని నీటిపారుదల శాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియలో ఎంపికైన ఏజెన్సీలు ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు మాత్రమే బ్యారేజీల పునరుద్ధరణ డ్రాయింగులు, డిజైన్లు సిద్ధం చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఆ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు తెలుస్తోంది.
బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగులు సిద్ధమైతేనే అసలు రిపేర్ పనులు ప్రారంభమవుతాయి. ఈ అక్టోబర్ 15 గడువు తరువాత, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు, పనుల ప్రణాళికలు వెల్లడవుతాయి.





















