(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad as Union Territory: జూన్ 2 తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్: కేటీఆర్ సంచలన ఆరోపణలు
Telangana News: కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం యోచిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
Hyderabad a union territory says KTR- వేములవాడ: జూన్ 2 తరువాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకోవాలన్న శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కరీంనగర్ జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవటం ఖాయమేనని, బండి సంజయ్ షెడ్ కు పోవటం ఖాయమే కదా? అన్నారు. నిన్న మొన్నటి దాకా గౌరవమిచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారంటూ మండిపడ్డారు.
కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10-12 సీట్లు రావాలి. అప్పుడు మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ కష్టపడ్డారు. ఆయనకు 3 వేల మెజార్టీ రావటం బాధగా అనిపించింది. బీజేపోళ్లు 10 మంది కూడా ఉండరని, కానీ మనం వార్డుకు 3 వందల మంది వరకు ఉంటాం అయినా ఒకరి పేరు చెబితే ఒక్కరికి కోపం వస్తుంది, అలా ఉండొద్దని సూచించారు. మనకు ఒక్క సీటు రాదంటున్నాడు రేవంత్ రెడ్డి. మనం 2 సీట్లు గెలిస్తే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేస్తానని అంటాడు. ఇక్కడ వినోదన్న గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంట అని బండి అంటున్నాడు. వినోదన్నను గెలిపించి బండి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
బడా భాయ్, చోటా భాయ్ మోసాలు..
‘సిరిసిల్ల, హుజురాబాద్ మంచిగనే ఉన్నాయి. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలో కూడా బలంగా ఉండాలి. బడా భాయ్ హామీలు ఇచ్చి మోసం చేస్తే... ఇటు చోటా భాయ్ కూడా నోటికి వచ్చినట్లు చెప్పి మోసం చేసిండు. గీతా భవన్ చౌరస్తాలో నిలబడితే కాంగ్రెస్ క్యాండిడేట్ ను ఒక్కడన్న గుర్తుపడుతాడా? జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి గారిని కాదని ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తిని నిలబెట్టిన్రు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కదా ? బండి సంజయ్ ని గెలిపించేందుకు రేవంత్, బండి సంజయ్ ఒక్కటయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని కొందరు అంటరు. అసలు బీజేపీ తీస్ మార్ ఖాన్లను ఓడగొట్టిందెవరు? బీజేపీతో మనకు అండర్ స్టాండింగ్ ఉంటే కవిత జైల్లో ఉంటదా? 2014, 2019 లో బీజేపీ హవాను అడ్డుకున్నది కేసీఆర్ కాదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
జైశ్రీరాం, జై భారత్ అందాం..
మల్కాజ్ గిరి, చేవేళ్ల, కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ కి సబ్జెక్ట్ లేదని, బాష కూడా సరిగ్గా రాదు. కేవలం తెలిసిందల్లా జై శ్రీరామ్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జడ్పీ మీటింగ్ లకు రాడు. లోక్ సభలో ప్రశ్నలు అడగడు. మనం కూడా జై తెలంగాణ, జై శ్రీరాం, జై భారత్ అందామని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘రాముడు కూడా రాజధర్మం పాటించాలని చెప్పిండు. కరీంనగర్ ప్రాంతానికి బండి సంజయ్ ఏం పని చేసిండు. కరీంనగర్ కు రూపాయి తేలేదు. ఒక్క శిలాఫలకం వేయలేదు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని ఓడిస్తే దేవుళ్లు కూడా సంతోషిస్తారని వ్యాఖ్యానించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే వాళ్లకు బుద్ధి చెప్దాం. గాలి తిరుగుడు తిరిగే బండి సంజయ్ కు గుణపాఠం చెప్పాలె. రాహుల్ గాంధీ ప్రధాని మోదీని చౌకి దార్ చోర్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటాడు. చోట భాయ్ కచ్చితంగా లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతాడని’ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.