Karimnagar News : ప్రభుత్వం ఓకే చెప్పింది ..కానీ భూమి ఏది ? క్రీడా మైదానాల కోసం ఎన్ని కష్టాలో
కరీంనగర్‌లో క్రీడా మైనాదాలకు స్థలాల లభ్యత కష్టంగా మారింది. ఒక్కో క్రీడామైదానం కనీసం ఎకరం ఉండాలని నిర్దేశించుకున్నారు
Karimnagar News : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఎకరం స్థలంలో క్రీడా మైదానాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక మంది క్రీడాకారులు తమ ప్రతిభతో వివిధ క్రీడల్లో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లారు . అయితే గ్రామ స్థాయిలోనే ప్రోత్సహించే విధంగా సాధనకై క్రీడాకారులకు ఒక గ్రౌండ్ ఉండాలంటూ ప్రభుత్వ నిర్ణయించుకుంది. ఇప్పటివరకు "తెలంగాణ గ్రామ క్రీడాప్రాంగణం' "పేరిట స్థలాలు సేకరించాలని ఆదేశించింది.
మైదానాలకు అందుబాటులో లేని భూమి !
కోకో, కబడ్డీ, వాలీబాల్ ,లాంగ్ జంప్ వంటి ఆటల సాధన కోసం నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు మండలానికి రెండు గ్రామాల నుండి ప్రపోజల్స్ తీసుకొని విధంగా ముందుగా ఎంపిక చేసి జూన్ 2న పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధికారులకు ఇక్కడ ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అసలు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుండా పోవడమే అసలు సమస్యగా మారింది. ఇప్పటికే పలు ప్రభుత్వ సంబంధిత భూములను వివిధ వర్గాలకు కేటాయించడం గానీ లేదా కుల సంఘాలకు ఇతర అవసరాలకు ప్రభుత్వ భూములను విరివిగా వాడారు. ఇక చాలావరకూ స్థానిక నేతల అండదండలతోనే కబ్జా పరమయ్యాయి. ఇందులో అన్ని పార్టీల నాయకుల హస్తం ఉంది. అధికారంలో ఎవరు ఉంటే వారు అన్న చందంగా ప్రభుత్వ భూములను గ్రామాల్లో లేకుండా చేశారు.
గ్రామీణ క్రీడాకారుల్ని తీర్చిదిద్దే ప్రయత్నం !
ఇక క్రీడల పట్ల గత పాలకులు చిన్నచూపు అనుసరించడంతో దాదాపుగా అసలు ఆ అంశాన్ని సిలబస్ నుండి తీసివేసినట్టుగా అయింది. ఇలాంటి సమయంలో ఆకస్మికంగా ఎకరం భూమిని ఒకే దగ్గర గుర్తించడంతో పాటు అది కూడా గ్రామ క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా సమీపంలో ఉండడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికైతే ఒక స్థాయికి వచ్చిన క్రీడాకారులు అంతా సమీప పట్టణం లోని స్టేడియంలో మెరుగైన శిక్షణ కోసం కోచ్ ల వద్ద చేరుతున్నారు . ఇక ఆట స్థలాల కు సంబంధించి ఎంపిక కోసం మొత్తంగా పెద్దపల్లిలో 266 పంచాయతీలు ఉండగా కరీంనగర్లో 313 ఉన్నాయి. ఇక జగిత్యాలలో 380 ఉండగా రాజన్న సిరిసిల్ల లో 255 పంచాయితీలు ఉన్నాయి .మొత్తానికి కలిపి కనీసం మండలానికి రెండు గ్రామాలను ఒకవేళ హడావుడిగా ఎంపిక చేసినప్పటికీ దానికి సంబంధించి సరైన వసతి సౌకర్యాలు కల్పించడానికి సమయం పడుతుంది .
ఉపాధి హామీ నిధులు వాడుకోవాలని నిర్ణయం !
వాలీబాల్ మైదానం కోసం 20 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పు ... ఖోఖో ఆట కోసం 16 మీటర్ల వెడల్పు 25 మీటర్ల పొడవు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కబడ్డీ సాధన కోసం 13 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు ల ప్రాంగణాల తో పాటు వ్యాయామం చేయడానికి మూడున్నర మీటర్ల పొడవు రెండు మీటర్ల ఎత్తులో ఉన్న స్తంభాలు లాంగ్ జంప్ కోసం ఆరు మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పుతో అర మీటరు లోతు మట్టి తీసి తయారు చేయనున్నారు. దీనికి ఉపాధి హామీ పథకాన్ని జోడించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.