Adivasis Celebrations: దేశ అత్యున్నత పదవిలో ద్రౌపది ముర్ము, సంబరాలు చేసుకున్న ఆదివాసీలు!
Adivasis Celebrations: ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణస్వీకరం చేయడంతో ఆదివాసీలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది తమకు దక్కిన గొప్ప గౌరవంగా వాలు వేడుకలు చేసుకుంటున్నారు.
Adivasis Celebrations: దేశంలోనే తొలి సారిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించడం ఆదివాసీలకు భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ అన్నారు.
ఆదివాసీల సంబరాలు:
ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల తుడం దెబ్బ ఆధ్వర్యంలో జైనూర్ మండల ప్రధాన రహదారి గుండా ఆదివాసీలు సాంప్రదాయ డోలు, తుడుం, పెప్రే, కాలి కోమ్ వాయిద్యాలతో డెంసా నృత్యాలతో సంప్రదాయ ర్యాలీ నిర్వహించారు. కుమ్రం భీం మరియు రాణి దుర్గవతి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఆదివాసీలకు ఇదో గొప్ప గౌరవం:
ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ మాట్లాడుతూ.. నేడు భారత దేశ చరిత్రలోనే తొలి సారిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవి పొందడం గర్వకారణమని, ఎందరో మహనీయుల ఆశీర్వాదంతో ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి భాద్యతలు స్వీకరించారని విజయ్ తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్రపతి ముర్ము పాటు పడాలని ఆయన కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కోయపోషగూడ ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు దాడిని, అటవీ శాఖ అధికారుల తీరును మార్చాలని, ఆదివాసీలను సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణస్వీకారం:
భారత దేశానికి ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ హాలులో ప్రమాణం స్వీకారం చేశారు. ద్రౌపది ముర్ము చేత సుప్రీం కోర్టు సీజే ఎన్.వి రమణ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రామ్ నాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రభుత్వంలోని ఉన్నత అధికారులు వేడుకకు హాజరు అయ్యారు.
ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం:
భారత దేశానికి 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము.. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత తొలి ప్రసంగం చేశారు. తాను దేశ అత్యున్నత పదవి చేపట్టడంపై దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వేడుక ముగిసిన తర్వాత తన కాన్వాయ్ తో రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రక్షక దళం నూతన రాష్ట్రపతి ద్రౌపరి ముర్ముకు గౌరవ వందనం అందించింది. ముర్ముకి 21 గన్ సెల్యూట్ చేశారు. ఆమె వెంట మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఉన్నారు.
రాష్ట్రపతి ముర్ము ప్రసంగం:
వార్డు కౌన్సిలర్ నుండి రాష్ట్రపతి వరకు వచ్చానని భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఆదివాసీ గ్రామం నుండి తన ప్రయాణం మొదలు అయిందని తెలిపారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తన వ్యక్తిగత విజయం కాదని.. ఆదివాసీలు, దళితుల విజయం అని తెలిపారు.