Kaleswaram Vigilance : కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ - ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు !
Vigilance Investigation : కాళేశ్వరం అవినీతిపై విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.
Kaleswaram vigilance investigation into corruption has started : కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్ ను ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం పన్నెండు చోట్ల సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు.. ఇతర అంశాలను తేల్చాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలిపారు.
జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆలోపు బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులైన అధికారులను విజిలెన్స్ విచారణలో గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనను రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ వైఫల్యం వెనుక కేసీఆర్ సర్కార్‌లో బాధ్యత ఎవరు అనేదానిపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది.
కాళేశ్వరం అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు అదే ప్రకటన చేశారు. మంత్రుల బృందం ఇటీవల మేడిగడ్డను సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని పరిశీలన చేసిన తర్వాత వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణలో తప్పు చేసినట్లుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేసి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ శాఖలో పారదర్శకత ఉండాలని ఆయన చెబుతున్నారు కాళేశ్వరంపై విచారణ కోట్లాది ప్రజలు విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమన్నారు. అంతా పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నారు.
కాళేశ్వరం అంశం రాజకీయంగానూ కలకలం రేపుతోంది. సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం.. తామే విచారణ చేస్తామని.. లోగుట్టు మొత్తం బయటకు తీస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో విజిలెన్స విచారణ ప్రారంభం కావడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.