Intermediate Exams: విద్యార్థులపై నిమిషం నిబంధన ఒత్తిడి- పునరాలోచించాలని ప్రజల సూచన
Inter Student Suicide: ఇంటర్ పరీక్షలకు నిమిషం నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటిసారి పరీక్షరాయలేకపోయా క్షమించు నాన్నా అంటూ అతడు రాసిన సుసైడ్ నోట్ కలచివేస్తోంది
INTER EXAMS: తెలంగాణ(Telangana)లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఓ విద్యార్థి నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఆదిలాబాద్(Adilabad) జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి గురువారం సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు యువకుడు తన తండ్రికి రాసిన సుసైడ్ నోట్ అందరి కంట కన్నీరు తెప్పిస్తోంది.' నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా'.. అంటూ శివకుమార్ రాసిన సూసైడ్ నోట్ చూసి అందరి హృదయాలు ద్రవించాయి.
ఆదిలాబాద్‌లోని సాత్నాల బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న టేకం శివకుమార్‌కు....కలెక్టర్ బంగ్లా సమీపంలో ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలోఇంటర్ సెంటర్(Inter Exam Center) పడింది. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా...తొలిరోజే శివకుమార్ 3 నిమిషాల ఆలస్యంగా సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉండటంతో అప్పటికే పరీక్షా కేంద్రం గేట్లకు తాళాలు వేశారు. ఎంత బ్రతిమాలినా ప్రిన్సిపల్ విద్యార్థిని లోనికి అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన టేకం శివకుమార్ సూసైడ్ నోట్ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని సాత్నాల ప్రాజెక్టు నుంచి గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు బయటకు తీయించారు. పెద్దచదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని భావిస్తే..ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంపై తల్లిదండ్రులు భోరున విలపించారు.
కన్నీటి పర్యంతం
తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. కొత్తగా నిమిషం నిబంధన అమల్లోకి తెచ్చారు. నిర్థిష్ట సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతించరు. తొలిసారి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సులు సమయానికి రాకపోవడం తదితర కారణాలతో తొలిరోజు, మలిరోజు చాలామంది విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. వారు వచ్చేసరికి గేట్లకు తాళాలు వేసి ఉండటంతో అవాక్కయ్యారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. కాళ్లావేళ్లాపడి బ్రతిమిలాడినా వారిని అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. బస్సు ఆలస్యంగా వచ్చిందని కొందరు, అనారోగ్య కారణాలతో మరికొందరు రాలేకపోయామని ఏడ్చారు. నిబంధనలు మీరి తామేమీ చేయలేమని పరీక్షా కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో వారు వెనుదిరిగారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిమిషం నిబంధన కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించాయి. తెలిసీ తెలియని కౌమారదశ..ఆలోచనా పరిజ్ఞానం అంతగా పరిణితి చెందని ఆ వయస్సులో చిన్నచిన్న తప్పులకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. చిన్న అవమానాన్ని కూడా భరించలేని కూడా వారి మనసు తట్టుకోలేదని పరీక్షల్లో ఒక్క మార్కు తక్కువ వస్తేనా భరించలేని వాళ్లు ఏడాదింతా కష్టపడి చదివి నిమిషం ఆలస్యం కారణంగా పరీక్ష రాయలేకపోతే వారి హృదయం ఎంత తల్లడిల్లిపోతుందని అంటున్నారు. తమతోపాటు చదువుకున్న వాళ్లంతా పరీక్షరాస్తుంటే తాము మాత్రం గేటు బయటే ఉండిపోవడాన్ని జీర్ణించుకోలేక ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాలేజీలో స్నేహితులకు, అధ్యాపకులకు ముఖం ఎలా చూపించాలో తెలియక... తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ప్రాణాలు తీసుకుంటారని వాపోతున్నారు.