Ibrahimpatnam News : ఇబ్రహీంపట్నం కు.ని. ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదీ? పరిహారం సమస్యకు పరిష్కారమా?
Ibrahimpatnam News : ఇబ్రహీంపట్నంలో కు.ని ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెందిన ఘటన సంచలం అయింది. అయితే ఈ ఘటనలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.
Ibrahimpatnam News : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నాలుగురు మహిళలు మృతి చెందిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనకు నివారణ చర్యలు చేపట్టిన తెలంగాణ వైద్యశాఖ తప్పడగువేసిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణకు ఆదేశించాం..మరో వారం రోజుల్లో విచారణ పూర్తవుతుందని చెప్పిన వైద్యశాఖ ఉన్నాతాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంది. ఆయనపై శాశ్వతంగా అనర్హత వేటువేశారు. కొందరు డాక్టర్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించడం చేశారు. ఇదంతా చూస్తుంటే తప్పు జరిగిన మూలాలు గుర్తించి, మరోసారి అలాంటి విషాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం కంటే తప్పును పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాంపులతో మాఫీ చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆసుపత్రి పేరు చెబితే హడల్
ఇబ్రహీపట్నం ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వెళ్లినప్పుడు అక్కడ వైద్యసిబ్బంది వ్యవహరించే తీరుపై రోగులకు చిర్కెత్తుకురావడం సర్వసాధారణం. ఆసుపత్రిలో కు.ని ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు అనే విషయం వెలుగుచూసిన తరువాత కూడా అక్కడ పరిస్థితిలో మార్పురాలేదు. పాముకాటుతో ఓ మహిళ అదే ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. విషం శరీరంలోకి సోకకుండా వైద్యం అందించాల్సిన వైద్యులు, బాధిత మహిళను రెండు గంటల పాటు ఆసుపత్రిలోనే పడిగాపులు పడేలా వదిలేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని బాధితులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కోకొల్లలని ఆరోపిస్తున్నారు. తాజాగా కు.ని ఆపరేషన్ వికటించడంతో అక్కడి వైద్యుల అసలు రంగు బయటపడిందని బాధితులు అంటున్నారు.
ఒకే రోజు 34 మందికి ఆపరేషన్లు
ఈనెల 25వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. వారిలో ఆపరేషన్ జరిగిన మూడు రోజులకు ఓ మహిళ, తరువాత రోజు మరో మహిళా, తాజాగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ సూపరింటెండెంట్ పైనో, లేక మరోకరిపైనో వేటు వేయడంతో సమస్యకు పరిష్కారం దొరుకుంతుందా? లేదా? పరిహారమో లేక మరొకటి ఆశచూపి నిరసనలను ఆపినంత మాత్రాన క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలకు శాశ్వత మందు పడినట్లేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆయా వ్యవస్థలను ముందుండి నడిపిస్తున్న పాలకులు, వారి చేతల్లో ఉన్న అధికారులు ప్రశ్నించుకోవాల్సిన అసవరం వచ్చిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
నిర్లక్ష్యంపై దృష్టి పెట్టకుండా?
ఉన్నత వైద్యం అందిస్తున్నాం.. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం అంటూ చెబుతున్న నాయకులు ఇలాంటి నిర్లక్ష్యంపై దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే రోజు 34 మందికి కు.ని. ఆపరేషన్ చేస్తే అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయేంతలా నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది. తప్పు జరిగిందని ఒప్పుకున్నాక, చేసినవారిపై చర్యలు తీసుకున్నామని ప్రకటించే అధికారులు... సమస్యకు పరిష్కారం చూపకుండా దాటవేసే పరిస్థితి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. మా తప్పులేదు.. ఆపరేషన్ విజయవంతం..కానీ పేషెంట్ మాత్రం.. అంటూ మరో వారం విచారణ పేరుతో ఎందుకు దాటవేస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మిగిలిందని బాధితులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్ వ్యూహాలపై దృష్టికన్నా విచారణ చేస్తున్నాం కాస్త ఆగమంటున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నతీరుపై బాధితులు మండిపడుతున్నారు. ఏదేమైనా దెబ్బతగిలిన చోట మందు వేయడం కంటే చూసేవారికి దెబ్బకనబడకుండా చర్యలు తీసుకుందాం అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారనే విమర్మలు వినిపిస్తున్నాయి.
Also Read : కు.ని ఆపరేషన్ల విషాదంపై హెచ్‌ఆర్సీ సీరియస్ - నివేదిక ఇవ్వాలని ఆదేశం