HYDRA: రాంనగర్‌లో 'హైడ్రా' కూల్చివేతలు - ఫిర్యాదు చేసిన రెండ్రోజుల్లోనే చర్యలు
Hyderabad News: నగరంలో అక్రమ కట్టడాలపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా, రాంనగర్‌లోని అక్రమ నిర్మాణాలను స్థానికుల ఫిర్యాదుతో అధికార యంత్రాంగం కూల్చివేసింది.
HYDRA demolitions In Ramnagar: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' (HYDRA) కొరడా ఝలిపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులకు సంబంధించిన అక్రమ భవనాలకు నోటీసులు ఇచ్చి కూల్చేసిన హైడ్రా అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదుల ఆధారంగానూ విచారించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో (Ram Nagar) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఇక్కడ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను 2 రోజుల క్రితం 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ నిర్మాణాలు అక్రమమే అని తేల్చిన అధికారులు శుక్రవారం ఉదయం చర్యలు చేపట్టారు.
స్థానికుల ఫిర్యాదుతో
ఇక్కడ విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు 2 రోజుల క్రితం 'హైడ్రా' కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాలతో స్పందించిన యంత్రాంగం అక్కడ కల్లును పారబోసి సామగ్రిని పూర్తిగా తొలగించి.. కూల్చివేతలు చేపట్టింది. కాగా, హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే అధికారులు చర్యలకు ఉపక్రమించారని ప్రశంసించారు.
నగరంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. నెల రోజుల వ్యవధిలో 18 నిర్మాణాలను కూల్చి 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, కొన్ని చోట్ల తమకు నోటీసులు ఇవ్వకుండానే యంత్రాంగం భవనాలు కూల్చేస్తున్నారని అక్కడ నివాసం ఉండే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు తీసుకునే భవనాన్ని నిర్మించామని అయినా నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారని పేర్కొంటున్నారు.
ఆ అధికారులపై 'హైడ్రా' చర్యలు
మరోవైపు, చెరువులు, కుంటలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసిన 'హైడ్రా' ఇప్పుడు ఆ నిర్మాణాలను అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతోంది. నిషేధిత ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ సీపీకి 'హైడ్రా' సిఫార్సు చేసింది. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సైతం సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ హెచ్చరిక
కాగా, 'హైడ్రా' పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు అందడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు తమను బెదిరిస్తున్నారని.. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేళ్ల కిందట ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొందరు అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం తెలిపారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని.. కొన్నిచోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు అందాయని చెప్పారు. అలా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా వసూళ్లకు పాల్పడే వారిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.
Also Read: Warangal News: వరంగల్ జిల్లాలో కీలక మావోయిస్టు లొంగుబాటు- ఆ మూడు కారణాలతోనే జనంబాట