KTR : కేటీఆర్ అరెస్టు ఖాయమా! సంకేతాలు ఇచ్చేశారా? ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నెక్స్ట్ ఏంటీ?
KTR : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణకు వెళ్లే ముందు ఆయన చేసిన కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఏం జరగబోతోందనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.

KTR : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జనవరిలో ఒకసారి పిలిచి విచారించారు. తర్వాత అధికారులతోపాటు ఇందులో భాగమైన వారిని ప్రశ్నించారు. వారు చెప్పిన వివరాలతో ఇప్పుడు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఉదయం 9 గంటలకు నందీనగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్ పది గంటలకు ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్‌రావు ఉన్నారు. ఆయన సమక్షంలోనే ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగానే అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థలు అనుమతులు లేకుండా ఎఫ్‌ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణ సాగుతోంది.
ఈ-రేస్ కేసులో విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పిన కేటీఆర్ ఈ కేసులో అవసరం అయితే తనను అరెస్టు చేస్తారని కూడా కామెంట్ చేశారు. ఇలాంటి కేసులు పెట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని ఆరోపించారు. ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారని ఏం తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు, ఎప్పుడు పిలిచినా ధైర్యంగా హాజరై నిజమే చెబుతానని అన్నారు.
✳️ ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) June 16, 2025
ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలు 👇🏻
♦️ చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము
♦️ ఇది మూడోసారి విచారణకు పిలవటం. మూడుసార్లు కాదు… pic.twitter.com/UVErNGDw4U
ఈ కేసులో తనను అవసరమైతే అరెస్టు కూడా చేస్తారని కేటీఆర్ చెప్పడం ఒక్కసారిగా కలకలం రేగింది. ఇవాళ అరెస్టు అవుతారా అనే అనుమానం కలుగుతోంది.తమకు చట్టాలు, కోర్టులపై గౌరవం ఉందన్న కేటీఆర్.... వెయ్యిసార్లు విచారణలకు పిలిచినా అరెస్టులు చేసినా తగ్గేదేలేదు అన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జైలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇంత కాలయాపన లేకుండా నేరుగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే సరిపోతుందని సవాల్ చేశారు. ప్రజల ముందు ఆ టెస్టు చేస్తే ఎవరు ఎలాంటి వ్యక్తులతో తేలిపోతుందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్, బీజేపీవి దొంగనాటకాలు ఆడుతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కేసులు పెట్టి సతాయిస్తున్నారని ఆరోపించారు. రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చేశారని దుయ్యబట్టారు. 420 గ్యారెంటీలు, హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు. వాటిపై ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని చేసినా కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.
ఒక్కసారి కాదు వందసార్లు పిలిచినా వస్తా..
— BRS Party (@BRSparty) June 16, 2025
జైలుకు వెళ్లేందుకు అయినా నాకు భయం లేదు.
ఒక్క కేసు కాదు ఇలాంటి వెయ్యి అక్రమ కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/18BXTSefow
కేటీఆర్ విచారణ నేపథ్యంలో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులని మోహరించారు. 400 మంది పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ లీడర్లను, కార్యకర్తలను అడ్డుకున్నారు.




















