(Source: ECI/ABP News/ABP Majha)
SC Sub Classify: ఉపవర్గీకరణ తక్షణమే అమలు దిశగా ప్రయత్నాలు- సుప్రీంకోర్టు తీర్పుపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Telangana : వీలైనంత వేగంగా మాదిగల వర్గీకరణ అమలు పరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అసెంబ్లీ దీనిపై కీలక ప్రకటన రేవంత్... ఈ అంశంపై చర్చ ప్రారంభించారు.
Telangana CM Revanth Reddy on SC Sub Classify : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీనిపై సభలో కీలక ప్రకటన చేశారు. దేశంలో ఈ తీర్పును అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. వీలైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా తీర్పును అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఈ అంశంపైనే రోజంతా సభలో చర్చిద్దామని సూచన చేశారు. అనంత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై చర్చ ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి తన స్టేట్‌మెంట్‌లో ఏమన్నారంటే... "ఇవాళ కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని దశాబ్ధాల నుంచి లక్షల మంది మాదిగ యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ 27 ఏళ్ల నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే శాసనసభలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతోపాటు ఆ నాటి ఎమ్మెల్యే సంపత్‌ను సభ నుంచి బహిష్కరించారు. ఏబీసీడీ వర్గీకరణపై కేంద్రానికి లెటర్ రాయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని గత ప్రభుత్వం చెప్పి మాదిగలను మోసం చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దామోదర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలను న్యాయవాదులను ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు తెలంగాణ రాష్ట్రం తరుఫున వినిపించాం.
తెలంగాణ ప్రభుత్వ న్యాయపోరాట ఫలితంగా సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అంగీకారం తెలిపింది. దానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తీర్పు ఇచ్చిన బెంచ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏడుగురిలో ఆరుగురు రాష్ట్రాలకు ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేస్తున్నాను. అందరి కంటే ముందు నిలబడి ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం. మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. ఇవాళ సభ అందరూ ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగల ఉపకులాల వర్గీకరణకు సహకరించాలని కోరుతున్నాను.
తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్‌రావు
ఉపకుల వర్గీకరణ తీర్పుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కౌరవుల సభ మాదిరిగా నడుస్తున్నాయని విమర్శించారు. అంతిమంగా పాండవులే గెలిచారని ఇప్పుడు కూడా తామె గెలుస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం తప్పుడు సమాచారాన్ని సభలో చెప్పారని ఫైర్ అయిన హరీష్... టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానిని కలిసి వర్గీకరణ చేపట్టాలని కోరామన్నారు. ఆరోజు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చాలా మంది ప్రాణ త్యాగం కూడా చేశారని వివరించారు. వర్గీకరణపై స్టాండ్ ఏంటో చెప్పాలని గాంధీభవన్ వద్ద ఉద్యమకారులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తే నాడు కాంగ్రెస్ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకను స్వాగతిస్తున్నామన్నారు.