మోదీ ఇంకా ఏం కావాలి... ప్రధాని కంటే పెద్ద పదవి ఇంకేం ఉంది? : కేసీఆర్
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం చేయబోనన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మత పిచ్చిగాళ్ల ట్రాప్‌లో పడితే ప్రమాదమని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్... బీజేపీ, కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఇంకా ఏ దురాశతో దేశాన్ని ఆగం పట్టిస్తున్నారో చెప్పాలని మోదీని నిలదీశారు. మోదీకి ఇంకా ఏంకావాలో చెప్పాలన్నారు. ఉన్న ప్రధానమంత్రి పదవి కంటే పెద్ద పదవి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బిహార్‌లో ఏం జరుగుతోంది.. దిల్లీలో ఏం జరుగుతోంది. బెంగాల్‌లో ఏం జరుగుతుంది. తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చు
ఎనిమిదేళ్ల నుంచి తెలంగాణలో చీమ చిటుక్కుమన్న సంఘటన లేదని... ఇప్పుడు మాత్రం చిచ్చు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధిలో దూసుకెళ్తుందని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణలో ఈ మతపిచ్చిగాళ్లు ఏం చేస్తున్నారో చూడాలన్నారు. ఎలాంటి దుర్మార్గమైన పద్దతుల్లో వెళ్తున్నారో గమనించాలని సూచించారు.
ప్రాణం ఉన్నంత వరకు ఆగం కాదు
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియ్యను అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణను కాపాడటానికి సర్వశక్తులను దారపోస్తా అన్నారు. తనకు బలం బలగం.. ప్రజలేనని అభిప్రాయపడ్డారు. వారి ఆశీస్సులు ఉన్నంత వరకు దూసుకుపోతుంటాను అని తెలిపారు. మత పిచ్చికి లోనైతే మళ్లీ పాత తెలంగాణ వస్తుందని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి #KCR .. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి pic.twitter.com/oHTT5ZP4F4
— AIR News Hyderabad (@airnews_hyd) August 25, 2022
ఇప్పుడు దెబ్బతింటే వందేళ్లు వెనకబడతాం
ఇప్పుడు చిచ్చు రేపుతున్న వాళ్లు ఎక్కడా ఉద్దరించింది ఏమీ లేదన్నారు కేసీఆర్. వాళ్లు చేసిందేమీ లేదని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం వెళ్లి అడగండి... తెలంగాణలోని నియోజకవర్గానికి ఐదు వందల మందిని తీసుకెళ్లి అక్కడ తిప్పాలన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకం కూడా అక్కడ లేదని వివరించారు. తెలంగాణ పచ్చగా ఉంటే వాళ్ల కళ్లు మండి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు. మోసపోతే ఘోస పడతామన్నారు కేసీఆర్. వీళ్లు కారణంగా దెబ్బతింటే తెలంగాణ, దేశం వందల ఏళ్ల పాటు ఆగమైపోయే అవకాశం ఉందన్నారు. అసూయ ద్వేషం పెరిగితే సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.
సమాజంలో అసహనం రేపుతున్నారు
ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కృష్ణాజలాల సంగతి కేంద్రం తేల్చలేదన్నారు కేసీఆర్. ఈ సమస్య పరిష్కారానికి ఎనిమిదేళ్లు సరిపోవా అని ప్రశ్నించారు. వంద దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే... దాన్ని ఉపసంహరించుకుంటే సమస్య పరిష్కరిస్తామన్నారన్నారు. ఉపసంహరించుకున్నప్పటికీ ఏడాదికిపైగా అవుతున్నా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి క్రియాహీనమైన ప్రభుత్వాన్ని సాగనంపింతే తప్ప దేశంలోని చాలా సమస్యలు పరిష్కారం కావన్నారు. అన్ని రకాలుగా బాగుపడతాం. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ఉన్నతమైన పాత్ర పోషించాలన్నారు. ప్రజల్లో చీకలకు తీసుకొచ్చి సమాజంలో అసహనాన్ని తీసుకొచ్చే మతపిచ్చిగాళ్లను సాగనంపాలన్నారు.