Food Poisoning: తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత
Telangana News | నారాయణపేట జిల్లాలోని ఓ జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Food Poisoning at Maganoor Zilla Parishad School | మహబూబ్ నగర్: తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. మూడు వారాల కిందట కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా, ఓ విద్యార్థిని సోమవారం నాడు చనిపోవడం విషాదాన్ని నింపింది. తాజాగా మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. అయితే వారం రోజుల్లోనే మూడోసారి ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నారాయణపేట జిల్లాలోని మాగనూరు జడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. మాగనూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 20 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో విద్యార్థులను మాగనూరు, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మాగనూరు జడ్పీ స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZP School)లో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. నేడు మధ్యాహ్న భోజనం తిన్న తరువాత చాలా మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. కొందరు విపరీతమైన తలనొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్స అందించారు. కొందరు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కేవలం వారం రోజుల్లో మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఇది మూడోసారి అని దీనిపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వద్ద ఉన్న ఎస్సీ బాలిక కాలేజీ హాస్టల్‌లోనూ విద్యార్థులకు అన్నంలో పురుగులు వచ్చాయని సమాచారం. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కలుషిత ఆహారం పెట్టడం వల్ల అస్వస్థతకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజు ఇలానే భోజనంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఎఫ్ఐ యూనియన్ కు విద్యార్థులు చెప్పారు.
Also Read: Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 30న ఫుడ్ పాయిజన్‌కు గురై కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించి వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి చికిత్స అందించారు. ఇద్దరు కోలుకోవడంతో డాక్టర్లు వారిని డిశ్చార్జ్ చేశారు. నాలుగు వారాలుగా చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ (16) నవంబర్ 25న మృతి చెందడంతో విషాదం నెలకొంది. నవంబర్ 5న హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి ముగ్గురికి చికిత్స అందించగా.. ఇద్దరు బాలికలు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శైలజ అనే విద్యార్థిని శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో చనిపోయింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందనంటూ కుటుంబసభ్యులు హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు.