PM Modi: సికింద్రాబాద్ లాడ్జి ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
‘‘సికింద్రాబాద్‌లో జరిగిన ప్రమాదంలో కొంత మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. చనిపోయిన వారి కుటుంబాల వారికి సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి చనిపోయిన వారి కుటుంబాల వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘‘బిల్డింగ్ సెల్లర్ ని మిస్ యూస్ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయి. 8 మంది స్మోక్ ద్వారానే చనిపోయారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తాం. బైక్ షోరూం నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు.
సెల్లార్ లో 37 ఎలక్ట్రిక్ బైక్ లు
ఘటనకు సంబంధించిన వివరాలను నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి మీడియాకు వివరించారు. ‘‘రూబీ లాడ్జీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఏడుగురికి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందుతుంది. లాడ్జి భవనానికి ఒకటే దారి ఉండడంతో రెస్క్యూ ఇబ్బందిగా మారింది. మొత్తం అంతట పొగలు వ్యాపించాయి. రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. ఫైర్ సేఫ్టీ, మార్కెట్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఐదుగురి మృత దేహాలు గుర్తించి బంధువులకు అప్పగించాం. మిగతా వారిని గుర్తించి పోస్ట్ మార్టం జరిపి మృతదేహాలు అప్పగిస్తాం. ప్రమాదం జరిగిన సెల్లార్ లో 37 ఎలక్ట్రిక్ బైక్ లు ఉన్నాయి. ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్, క్లూస్ టీం తో క్లూస్ సేకరించాము’’ అని చందన దీప్తి వెల్లడించారు.
కింద బైక్ షోరూం, పైన లాడ్జి
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగతో మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఓ మహిళ ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మరో 13 మంది గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షోరూం పైన లాడ్జి ఉండడంతో అందులో పెద్ద సంఖ్యలో పర్యటకులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ప్రయత్నం చేశారు.