Hyderabad Bullet : ఐదో అంతస్తులోకి దూసుకొచ్చిన బుల్లెట్ - షార్ప్ షూటర్ల పనేనా ? ఎవరు టార్గెట్ ?
Telangana : హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లోకి బుల్లెట్ దూసుకొచ్చిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఎవరో షార్ప్ షూటర్లు షూట్ చేసినట్లుగా ఉండటంతో హత్యాయత్నం చేశారా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad bullet Shot in Apartment : అది నార్సింగి బైరాగిగూడలోని అపార్టుమెంట్. శనివారం కదా అని ఆ ఇంట్లో వాళ్లు కాస్త రిలాక్సుడ్ గా ఉన్నారు. కానీ అంతలోనే అద్దం పగిలిన శబ్దం. ఇంట్లో ఏదో పడినట్లుగా తెలుస్తూనే ఉంది. పక్క రూము నుంచి హడావుడిగా వచ్చి చూస్తే.. అద్దం చాలా చిన్నగా పగిలింది. అంత అంటే.. సినిమాల్లో చూపించినట్లుగా తుపాకీ నుంచి బుల్లెట్ వస్తే ఎలా పగులుతుందో అంతే. రూములో చూస్తే నిజంగానే బుల్లెట్ ఉంది. దీందో హడలిపోయారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే వరకూ భయంతో వణికిపోయారు.
ఒక్క సారిగా కిటికీ అద్దాలను చీల్చుకుంటూ దూసుకొచ్చిన బుల్లెట్
నార్సింగిలోని బైరాగిగూడలో ఇప్పుడిప్పుడే కాలనీలు వెలుస్తున్నాయి. అక్కడ ఓ ఐదు అంతస్తుల అపార్టుమెంట్ ను నిర్మించారు. అందులో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఓ కుటుంబం..ఐదో అంతస్తులో ఫ్లాట్ తీసుకుని కిటీకీ నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే కిటీకీ నుంచి ఐదో అంతస్తు నుంచి బుల్లెట్ రావడంతో భయపడిపోతున్నారు.
సమీపంలోనే ఫైరింగ్ ట్రైనింగ్ రేంజ్
బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు రాగానే దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఉన్న బ్యాచ్ నెంబర్లు ఇతర వివరాలు చూస్తే.. పోలీసు శాఖకు చెందినదిగా గుర్తించారు. దీంతో చురుగ్గా ఆలోచించిన పోలీసులు దగ్గరలో పైరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉందని గ్రహించారు. వెంటనే అక్కడి వారిని సంప్రదించారు. వారు ఊహించినట్లుగానే ఫైరింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఎత్తయిన ప్రదేశం నుంచి జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న సమయంలో ఓ జవాన్ గన్ నుంచి మిస్ ఫైర్ అయింది. అది నేరుగా అపార్టుమెంట్ లోకి దూసుకు వచ్చిందని గుర్తించారు.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న జనం
కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ దూసుకు కు వచ్చి షార్ప్ గా అద్దాన్ని కూడా పగులగొట్టి గోడను తాకడం భయం కల్పించేలా ఉంది. అదే మనిషిని తాకి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రాణహాని ఉండేదని భావిస్తున్నారు. ప్రాణహాని ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే మిస్ ఫైర్ అయితే ఇళ్లల్లోకి బుల్లెట్లు వచ్చేలా ఫైరింగ్ ట్రైనింగ్ ఉంటే.. భవిష్యత్ లో చాలా ప్రమాదమని బావిస్తున్నారు. అలాంటి ప్రమాదం ఉంటే ఇళ్లకు అనుమితి నిరాకరించడం కానీ..లేదా ఫైరింగ్ రేంజ్ నంచి బుల్లెట్లు బయటకు రాకుండా జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.