బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు గవర్నర్ తమిళి సై పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం దారుణమన్నారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం దారుణమన్నారు. బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారన్న కారణంతోనే అనర్హులు అంటూ తిరస్కరించడం సరికాదన్నారు. ఒక పార్టీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించొచ్చా ? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
తమిళిసై గవర్నర్‌లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. తమిళిసై మొదటి నుంచి తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆయన, ఇప్పటికే పలు కీలక బిల్లులు గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారో గవర్నర్ చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సర్కారియా కమిషన్ ప్రకారం గవర్నర్ పదవిలో తమిళిసై ఉండకూడదని, ఇపుడు ఎలా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ నేత గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా ? మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రాకేశ్ సిన్హా కమలం పార్టీలో పని చేయలేదా అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధానం.. వారితో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానమా ? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కేంద్రానికి ఒక నీతి, బీజేపీయేతర రాష్ట్రాలకు మరో నీతి ఉంటుందా ? తెలంగాణ విషయంలో గవర్నర్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, గవర్నర్ కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జులై 31న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో...వారి స్థానాల్లో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 వరకు బీజేపీలోనే ఉన్న ఆయన, ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్ లో కొంతకాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్‌ఎస్ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందంలో సభ్యుడిగా పనిచేశారు.