Bathukammakunta Lake: చెత్తకుప్ప నుండి జాతీయస్దాయికి బతుకమ్మకుంట చెరువు వైభవం.. హైడ్రాకు ప్రేరణగా ఎలా నిలిచింది..?
HYDRA | ఆక్రమణలకు కనుమరుగైన బతుకమ్మకుంట చెరువును మళ్లీ బ్రతికించింది హైడ్రా. అత్యతంత వైభవంగా అభివృద్ది చేసింది. చెత్త కుప్ప నుండి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బతుకమ్మ జరపడం ఎలా సాధ్యమైందంటే..!

హైదరాబాద్: బతుకమ్మకుంట చెరువు హైదరాాబాద్ అంబర్ పేట్ లో దాశాబ్ధాల కాలం నాటి సహజసిద్దమైన అతిపెద్ద చెరువు. 1917నాటికే 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన విశాలమైన ఈ చెరువులో అప్పట్లో బతుకమ్మ పండుగ వచ్చిందంటే అంబర్ పేట్ మాత్రమేకాదు హైదరాబాద్ నగరం నలుమూల నుండి బతుకమ్మలను ఇక్కడ చెరువు వద్దకు తీసుకొచ్చిన మహిళలు, ఇక్కడే బతుకమ్మను ఉంచి, ఆటపాటలతో ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఇదే చెరువులో బతుకమ్మను వైభవంగా సాగనంపేవారు. అలా దశాబ్ధాలుగా ఇక్కడ బతుకమ్మవేడులకు ఈ చెరువు వేదికగా మారడంతో దీనికి బతుకమ్మకుంటగా పులుస్తండేవారు.
కబ్జాలతో ముళ్ల పొదలతో నిండిపోయింది
ప్రభుత్వాలు మారడం, చెరువు నెమ్మదిగా ఆక్రమణలకు గురవ్వడం, ఏకంగా ఎతైన భవనాలను సైతం నిర్మించడం కాలక్రమంలో జరిగిపోయాయి. అలా 20ఎకరాల బతుకమ్మకుంట చెరువు కాస్తా, చివరికి 5 ఎకరాలకు మిగిలింది. ఆ మిగిలిన 5ఎకరాలను కూడా వదలకుండా స్దానిక బిఆర్ఎస్ నేత యడ్ల సుధాకర్ రెడ్డి ఆక్రమించుకుంటున్నాడని స్దానికులు గత ప్రభుత్వంలో అనేకసార్లు జిహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. నెమ్మదిగా చెరువు కాస్తా స్దానికులు చెత్తవేసే డంపింగ్ యార్డ్ గా మారింది. ముళ్ల పొదలతో నిండిపోయింది. రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి, ఏకంగా ఫ్లాట్ లు అమ్మేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలా ఒక్కప్పటి బతుకమ్మ కుంట చెరువు వైభవం కాస్తా నెమ్మదిగా కనుమరుగైపోయింది. అక్కడ చెరువు అనేది కనిపించకుండా మార్చేశారు.
హైడ్రాకు ప్రేరణగా నిలిచిన బతుకమ్మకుంట..
హైదరాబాద్ లో కనుమరుగవుతున్న చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు , ముంపుప్రభావం నుండి నగరాన్ని రక్షించేందుకు , ప్రభుత్వ స్దలాలను కబ్జా కోరల నుండి రక్షించేందుకు జూలై 19వ తేది 2024 హైడ్రాను ఎర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైడ్రా ఏర్పాటైన తొలిరోజుల్లో ఎఫ్ టిఎల్ పరిధిలో నిర్మాణాలు,వరుస కూల్చివేతలతో హైడ్రాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం సైతం ఊహించని వ్యతిరేకత ఎదుర్కొవల్సిన పరిస్దితులు ఏర్పాడ్డాయి. హైడ్రా కొనసాగుతుందా లేదా అనే స్దాయికి ప్రజల్లో వ్యతిరేకత వెళ్లిపోయింది. హైడ్రా రంగనాథ్ దూకుడు రేవంత్ రెడ్డికి కొత్త తలపోట్లు తెచ్చిపెట్టింది.

ఇదే సమయంలో బతుకమ్మకుంట చెరువు కబ్జా పంచాయితీ హైడ్రా చెంతకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ విహెచ్ ఫిర్యాదుతో బతుకమ్మకుంట రక్షణకు హైడ్రా రంగంలోకి దిగింది. జీహెచ్ ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది , న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తరువాత బతుకమ్మకుంట దశాబ్ధాల నాటి సహజసిద్దమైన చెరువే అని నిర్దారించుకున్నారు హైడ్రా కమీషనర్ రంగనాధ్. జేసిబిలతో హైడ్రా టీమ్ రంగంలోకి దిగింది. అలా జేసిబి ఆక్రమణలో మట్టి తవ్వగానే, ఒక్కసారిగా భూగర్బ జలాలు ఉబికి ఉప్పొంగాయి. కబ్బా కోరల్లో చిక్కుకున్న గంగమ్మ ఉవ్వెత్తున ఎగసిపడింది. ఇంకేముంది మీడియా వరుస కథనాలు, శభాష్ హైడ్రా అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. బ్రతకమ్మకుంట మళ్లీ బ్రతికిందని స్దానికులు హర్షం వ్యక్తం చేసారు. అప్పటి వరకూ హైడ్రాను తిట్టుకున్న నోళ్లే , వారెవ్వా హైడ్రా అంటూ పొగడ్తలతో ముంచెత్తాయి.

అక్కడ చెరువు సహజసిద్దంగా ఏర్పడిందే అని నిర్దారణ జరిగినా, అప్పటికే అక్కడ భూమి తనదంటూ సేల్ డీడ్ డాక్యూమెంట్లతో కోర్టులను ఆశ్రయించాడు యెడ్ల సుధాకర్ రెడ్డి. కోర్టులో సైతం తమ వాదనలు బలంగా వినిపించిన హైడ్రా, అది బతుకమ్మకమ్మ కుంట చెరువు , దానిపై వేరెవరికీ హక్కులేదంటూ నిరూపించింది. చెరువు అభివృద్ది పనులకు లైన్ క్లియర్ చేసుకుంది.
చెత్తకుప్ప నుండి అత్యంత సుందరంగా బతుకమ్మకుంట..
మండుటెండలు తీవ్ర స్దాయిలో ఉన్న సమయంలో బతుకమ్మకుంట అభివృద్ది పనులు చేపట్టింది హైడ్రా. 7.15 కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ కుంట రూపురేఖలు మార్చేందుకు నడుంబిగించింది. అంబర్ పేట్ మండలం బాగ్ అంబర్ పేట్ లోని సర్వే నెంబర్ 563లో 1917 తరువాత కొంత ఆక్రమణలకు గురికాగా, 1962 లెక్కల ప్రకారం బఫర్ జోన్ తో కలిపి 16ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉండేదని సర్వే అధికారులు తేల్చారు. ఇందులో 2015నాటికి 5.15 ఎకరాలు మాత్రమే మిగిలింది.అయితే నివాసప్రాంతాలు కూల్చకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, బతుకమ్మకుంట ఉన్న 5 ఎకరాల్లో అభివృద్ది చేసేందుకు హైడ్రా సిద్దమైయ్యింది.


పిక్నిక్ స్పాట్ మారిన బతుకమ్మకుంట చెరువు..
బతుకమ్మకుంట చెరువును హైడ్రా అభివృద్ది చేసిన తీరుకు హెట్పాఫ్ అనాల్సిందే. చెరువు చుట్టూ ఫిన్సింగ్ వాల్ పక్బంధీగా ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో బతుకమ్మను అలంకరించుకునే విధంగా ప్రత్యేకంగా బతుకమ్మ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశారు. అంబర్ పేట్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే వరదనీరు నేరుగా చెరువులోకి చేరే విధంగా ప్రత్యేకంగా రెండు ఇన్ లెట్ లు ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ ప్లే ఏరియా పిల్లలు ఆడుకునే విధంగా ఆటవస్తువులు, ఫిట్ నెస్ కోసం ఓపెన్ జిమ్ , ఆహ్లదకరంగా సేదతీరేందుకు పచ్చని, అందమైన పూల మొక్కలు.. ఇలా ఒకటేమిటి బతుకమ్మకుంట చెరువు హైదరాబాద్ నగరంలోనే మంచి పిక్ నిక్ స్పాట్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని , స్దానిక మహిళలతో బతుకమ్మకమ్మ ఆడటంతో జాతీయస్దాయి ఖ్యాతిని తెచ్చుకుంది బతుకమ్మకుంట చెరువు






















