HYDRA Demolitions: 15 వేల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడుతున్న హైడ్రా, ఐటీ కారిడార్‌కు 10 కి.మీ దూరంలో కబ్జాలు
HYDRA demolitions in gajularamaram | గాజులరామారంలో 15 వేల కోట్ల విలువ చేసే 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 21న ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

Gajularamaram in Medchal Malkajgiri district | హైదరాబాద్: ఐటీ కారిడార్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే గాజులరామారం ప్రాంతంలో ప్రభుత్వ భూములు భారీ స్థాయిలో ఆక్రమణలకు గురయ్యాయని హైడ్రా (HYDRA) గుర్తించింది. మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. అందులో 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఆ ఆక్రమించిన భూమిలో కొందరు 60 నుంచి 70 గజాలు, 80 గజాల పరిమాణంలో ఇళ్లు నిర్మించి, రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం నుంచి అక్రమ నిర్మాల తొలగింపు పనులు చేపట్టిన హైడ్రా అధికారులు నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగిస్తున్నట్లు చెప్పారు.
కబ్జాలు, ఆక్రమణలపై తొక్కుకుంటూ పోతున్న హైడ్రా
గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నంబర్ 307లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసింది. ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు రూ.4,500 నుంచి 5000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల సహకారంతో గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. హైడ్రా అధికారుల చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము లక్షల్లో డబ్బులు చెల్లించి ఇంటిని కొనుక్కున్నామని, అమ్మినవారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా తమ నివాసాలను కూల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైడ్రా చర్యలను నిరసిస్తూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిలబడి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఐటీ కారిడార్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో
ప్రస్తుతం గాజులరామారంలో మొత్తం 300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, ఇందులో 100 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురైనట్లు హైడ్రా స్పష్టం చేసింది. వంద ఎకరాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం మిగిలిన 200 ఎకరాల భూమిని సైతం కాపాడేందుకు హైడ్రా రూ.15 వేల కోట్ల విలువ గల 300 ఎకరాల భూమికి కంచె వేయాలని యోచిస్తోంది. గాజులరామారం, ఐటీ కారిడార్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, TGISC, హెచ్ఎండీయే, హౌసింగ్ బోర్డు వంటి సంస్థలకు గత ప్రభుత్వాలు భూములు కేటాయించినా, వాటిని అభివృద్ధి చేయకపోవడంతో కొందరు కబ్జాదారులు గ్రూపులుగా ఏర్పడి ఆ భూములను ఆక్రమించారు. కొందరు నేరుగా ప్లాట్లు విక్రయించగా, కొందరు చిన్న ఇండ్లు కట్టి బడ్జెట్ ధరలలో అమ్మేస్తున్నారు.
కేవలం 4 ఏళ్లలోనే 100 ఎకరాల భూమి కబ్జా
కేవలం 3, 4 ఏళ్లలోనే 103 ఎకరాల భూమిని ఆక్రమించారని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40 నుండి రూ.50 కోట్లు ఉంది. దాంతో ఆక్రమణలో ఉన్న భూముల విలువ రూ.4,500 నుంచి 5000 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిసరాల్లో ఉండే వారిని తక్కువ ధర అని ఆకర్షించి సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి అమ్ముతున్నారు. తమకు రెవెన్యూ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారుల నుంచి పర్మిషన్ వచ్చిందని, బిల్లులు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.
తక్కువ ధరలకే ఇంటిని సొంతం చేసుకోవాలని కొంతమంది అప్పులు చేసి మరీ ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. కబ్జా భూములపై ఫోకస్ చేసిన హైడ్రా అధికారులకు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో గాజులరామారంలో ప్రభుత్వ భూమి కబ్జా, అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. అయితే వీటిని విక్రయించిన కబ్జాదారులతో పాటు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు, సిబ్బందిపై ముందుగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆ ప్రాంత వాసులు హైడ్రా అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






















