Hydra On Manholes: హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్ ఘటనకు పూర్తి బాధ్యత హైడ్రాదే- కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hydra On Manholes: మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిన ఘటనకు పూర్తి బాధ్యత హైడ్రాదేనన్నారు కమిషనర్ రంగనాథ్. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Hydra On Manholes: హైదరాబాద్‌లోని యాకత్‌పురలో స్కూల్ నుంచి వస్తున్న చిన్నారి మ్యాన్‌హోల్ పడిన ఘటన వైరల్ అయ్యింది. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అసలు అధికారులు, సిబ్బంది ఏంచేస్తున్నారని ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ మ్యాన్‌హోల్ నిర్వహణ హైడ్రా చూస్తుందని పేర్కొంది. దీంతో అందరి కళ్లు హైడ్రాపై పడ్డాయి.
స్కూల్ నుంచి వస్తున్న టైంలో ఓ చిన్నారి ఆటోను చూస్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. వెంటనే పాపతో వచ్చిన మహిళ చూసి వెంటనే పైకి తీసుకొచ్చేందుకు యత్నించారు. చుట్టుపక్కల వాళ్లు కూడాచూసి ఆమెకు సాయం చేశారు. మొత్తానికి పాపను జాగ్రత్తగా అంతా కలిసి బయటకు తీశారు. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఇలా మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచిపెడితే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మ్యాన్‌హోల్స్‌లో పడి మనుషులు చనిపోయిన సంగతి అధికారులకు గుర్తు లేదా అని నిలదీశారు. అందరూ జీహెచ్‌ఎంసీని ప్రశ్నించారు. అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వస్తున్న విమర్శలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఎప్పటి నుంచో మ్యాన్‌హోల్ నిర్వహణ హైడ్రా పరిధిలోకి వెళ్లిందని పేర్కొంది.
మ్యాన్‌హోల్ నిర్వహణ హైడ్రా చూస్తోందని తెలియడంతో జనాలు మరింతగా రియాక్ట్ అయ్యారు. హైడ్రా అధికారులకు భవనాలు కూల్చివేతలో ఉన్న ఆసక్తి మ్యాన్‌హోల్స్ మూసివేయడం లేదని విమర్శించారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న వేళ హైడ్రా స్పందించక తప్పలేదు. జరిగిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చుకున్నారు. తమకు తమ వల్లే జరిగిందని అంగీకరించారు.
మ్యాన్‌హోల్ ఘటనకు హైడ్రాదే పూర్తి బాధ్యతని రంగనాథ్ ప్రకటించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జ్ అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.





















