China Jeeyar On KCR: ఎవరితోనూ పూసుకొని తిరగం- గ్యాప్ పెట్టుకుంటే వస్తుంది, కేసీఆర్‌తో విభేదాలపై చినజీయర్ షాకింగ్ కామెంట్స్
కేసీఆర్‌తో విభేదాలు ఉన్నట్టు చినజీయర్ స్వామి ఇండైరెక్ట్‌గా అంగీకరించారు. తాము ఎవరితోనూ రాసుకొని తిరగబోమన్నారు. యాదాద్రికి ఆహ్వానించకపోవడంపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు.
సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో మంచి అప్లాజ్ వచ్చిందన్నారు త్రిదండి చినజీయర్ స్వామి. ప్రపంచవ్యాప్తంగా దీనిపై డిస్కషన్ జరుగుతోందని.. దాన్ని తట్టుకోలేని వాళ్లే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
వాళ్లకు కళ్లు లేవు
20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలను ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చారన్నారు. దీనిపై లేనిపోని ఇష్యూ చేస్తున్నారన్నారు చినజీయర్. ఆ కామెంట్స్‌పై మాట్లాడుతున్న వాళ్లకు నిజంగా కళ్లు లేవన్నారాయన. సామాన్య మహిళలే గ్రామదేవతలుగా కొలుస్తున్నామని.. అలాంటి గ్రామదేవతల ముందు అసాంఘిక చర్యలు చేయడం తప్పన్నట్టు చెప్పుకొచ్చారు. అంతే కానీ వాళ్లను కించపరుస్తూ ఎలాంటి కామెంట్స్ చేయలేదని వివరణ ఇచ్చారు.
అది టికెట్ కాదు ఎంట్రీ ఫీ
సమతామూర్తి విగ్రహానికి చూసేందుకు తాము రూ. 150 టికెట్ తీసుకోవడం లేదని... కేవలం అక్కడి ప్రాంగణంలో జరిగే కార్యక్రమాలకు మాత్రమే వసూలు చేస్తున్నట్టు చెప్పారు చినజీయర్. ఆ విగ్రహం ఉన్న ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతుంటాయని.. ఒక వేళ టికెట్ పెట్టకుంటే అక్కడి వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ఛాన్స్ ఉందన్నారు. అసలు తాము తీసుకుంటున్నది టికెట్ కాదన్న ఆయన..అది ఎంట్రీ ఫీజు మాత్రమే అన్నారు. అసలు అక్కడ పూజలకు గానీ, ప్రసాదానికి గానీ ఒక్క రూపాయి తీసుకోవడం లేదని గుర్తు చేశారు.
నో పాలిటిక్స్
ఉత్తర్‌ప్రదేశ్ యోగిలా మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగిన మీడియాపై కాస్త అసహనం వ్యక్తం చేశారు చినజీయర్ స్వామి. కోడిగుడ్డుపై వెంట్రుకలు లాగడం మీడియాకు బాగా అలవాటైన పని అంటూ సెటైర్లు వేశారు. తాము రాజకీయాలకు చాలా దూరమన్నారు. తమకు అంతా సమానులేనని చెప్పుకొచ్చారు. తాము చేసే కార్యక్రమాలు గురించి తెలియకుండా మాట్లాడవద్దని మీడియా ప్రతినిధులకు హితవు పలికారు. తమ పేరు మీద బ్యాంకు అకౌంట్ కూడా ఉండదన్నారు. పూర్తిగా సబ్జెక్టు లేకుండా మాట్లాడితే అబాసుపాలు అవుతారన్నారు.
మాంసంపై క్లారిటీ
ఒకానొక సందర్భంలో ఏ మాంసం తింటే అలానే ప్రవర్తిస్తారన్న కామెంట్స్‌కి కూడా చినజీయర్ స్పందించారు. ప్రతి పనికి ఒక నియమం ఉంటుందన్నారు. డాక్టర్ కావాలనుకునే వ్యక్తి పదోతరగతి తర్వాత కొన్ని సబ్జెక్ట్‌లు వదిలేస్తాడని.. ఆ తర్వాత తరగతికి వెళ్లే సరికి మరికొన్నింటిని వదిలేస్తాడన్నారు. అలా తరగతి పెరుగుతన్న కొద్ది కొన్ని కొన్ని సబ్జెక్టులు వదిలేస్తూ వెళ్తేనే ఆ వ్యక్తికి ఫోకస్ ఉంటుందన్నారు. అలానే భక్తి భావంతో దీక్ష తీసుకున్న వ్యక్తి కొన్నింటినీ పాటించాలన్నారు. అలాంటి వాళ్ల కోసం చెప్పిన అంశమని మాంసంపై వివరణ ఇచ్చారు. అంతే కానీ రోడ్డు మీద పోయే ఎల్లయ్యపుల్లయ్య కోసం చెప్పిన విషయాలు కావన్నారు.
గ్యాప్ పెట్టుకుంటే వస్తుంది
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందట కదా అని ప్రశ్నిస్తే ఘాటుగా రియాక్ట్ అయ్యారు చినజీయర్. తమకు ఎవరితోనూ గ్యాప్ ఉండదన్నారు. ఎవరైనా గ్యాప్ పెట్టుకుంటే ఉంటుందన్నారు. మంచి లక్ష్యంతో కార్యక్రమాలు చేస్తుంటామని... అందులో కలిసి వచ్చిన వారితో ముందుకెళ్తామన్నారు. తమతో జాతి, కుల, మత భేదాల్లేకుండా పని చేస్తున్నవాళ్లు ఉన్నారన్నారు.
సమాజానికి మేం కళ్లు
తమ లాంటి వాళ్లు సమజానికి కళ్లు లాంటి వాళ్లమన్నారు చినజీయర్ స్వామి. దెబ్బలు తగలకుండా పడిపోకుండా జాగ్రత్త నడిచేలా ప్రోత్సహిస్తామన్నారు. ఎప్పుడైనా పొరపాటున దెబ్బ తగిలితే బాధ కలిగేదీ కళ్లకే అన్నారు. అందుకే తాము ఎప్పుడు మంచి ఉద్దేశంతోనే పనులు చేస్తుంటామని అభిప్రాయపడ్డారు.
పిలిస్తే వెళ్తాం
యాదాద్రి దేవాలయానికి ఆహ్వానం లేదా అంటే అవును అనేలా చినజీయర్ స్వామి సమాధానం వచ్చింది. తాము ఎవరితోనూ రాసుకొని పూసుకొని తిరిగబోమన్నారు. ఏదైనా చేయమంటే నిష్టతో చేస్తామన్నారు. బాధ్యత తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు విశ్రమించబోమన్నారు. యాదాద్రికి పిలిస్తే వెళ్తామని, లేకుంటే చూసి ఆనందిస్తామన్నారు.