(Source: Poll of Polls)
Munugode News : మునుగోడులో కాంగ్రెస్ కు భారీ షాక్, గులాబీ గూటికి పల్లె రవి కుమార్ గౌడ్ దంపతులు
Munugode News : మునుగోడు ఉపఎన్నిక ముందు కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. పల్లె రవి కుమార్ గౌడ్ దంపతులు గులాబీ గూటికి చేరారు.
Munugode News : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ తగిలింది. ఉపఎన్నికలో టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. రవికుమార్ గౌడ్ భార్య కళ్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ ఈ సమావేశంలో ఉన్నారు.
గులాబీ గూటికి పల్లె రవి దంపతులు
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి, భంగపడ్డ పల్లె రవికుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న రవి భార్య కళ్యాణి కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రవికుమార్ గౌడ్ దంపతులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమకాలం నుంచి పల్లె రవి తమతో కలిసి పనిచేశారన్నారు. పల్లె రవి మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషమని చెప్పారు. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయానికి అందరూ కలిసి పనిచేస్తామన్నారు. పల్లె రవికి భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను పార్టీ కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన బూర నర్సయ్య గౌడ్
మునుగోడు ఉప ఎన్నికలకు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ, మునుగోడు టిక్కెట్ ఆశించి నిరాశకు గురైన బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బూర నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. మాజీ ఎంపీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్త్ తరుణ్ చుగ్, బండి సంజయ్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్న సమయంలో టీఆర్ఎస్ కీలక నేత బీజేపీలో చేరేందుకు ఢిల్లీ రావడం .. ఆ పార్టీ నేతలను సైతం ఆశ్చర్య పరిచింది. 2014లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ .. టీఆర్ఎస్‌లో ప్రముఖ బీసీ నేతగా ఎదిగారు.