Bandi Sanjay On KCR : కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే అంబేడ్కర్ విగ్రహాన్ని ముట్టుకోవాలి - బండి సంజయ్
Bandi Sanjay On KCR : సీఎం కేసీఆర్ కు అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని బండి సంజయ్ విమర్శలు చేశారు.
Bandi Sanjay On KCR : దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున భారీ అంబేడ్కర్ విగ్రహం బీజేపీ పోరాటంతోనే సాధ్యమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు చేసిందేంలేదని విమర్శించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో బండి సంజయ్ పాల్గొ్న్నారు. భారీ అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. దళితద్రోహి కేసీఆర్‌కు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదంటూ మండిపడ్డారు. దళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే అంబేడ్కర్ విగ్రహాన్ని ముట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ దళితులను అన్ని విధాలుగా మోసం చేశారన్నారు.
తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి
"బీఆర్ఎస్ ప్రభుత్వం 120 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దీనిని బీజేపీ స్వాగతిస్తుంది. అయితే అంబేడ్కర్ విగ్రహ పనులు నిలిపివేస్తే బీజేపీ నేతలు పోరాడి తిరిగి పనులు మొదలయ్యేలా చేశారు. విగ్రహం పనులు చేపట్టకపోతే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని వార్నింగ్ ఇస్తే తప్పా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. సచివాలయ పనులను అనేకసార్లు పరిశీలించిన సీఎం కేసీఆర్.. అంబేడ్కర్ విగ్రహ పనులు పరిశీలించింది. అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించే అర్హత కేసీఆర్ కు లేదు. కేసీఆర్ దళిత ద్రోహి. అంబేడ్కర్ ను అవమానించిన వ్యక్తి. ఇన్నేళ్లు అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదు. సీఎం కేసీఆర్ ఈ ప్రశ్నలకు ఇవాళ సమాధానం చెప్పాలి. తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి." - బండి సంజయ్
Why didn’t KCR take part in Dr B R Ambedkar Jayanthi and Vardhanthi programs all these years?
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 14, 2023
Didn’t KCR insult Babasaheb by asking to rewrite the constitution?
What happened to promise to make a Dalit the first CM not implemented?
Why Dalits were not given 3acres land as… pic.twitter.com/QvM1GHYL0t
అంబేడ్కర్ విగ్రహ పనులు ఎందుకు పరిశీలించలేదు
నూతన సచివాలయం పనులను తరచూ పర్యవేక్షించిన సీఎం కేసీఆర్.. అంబేడ్కర్ విగ్రహం పనులను ఒక్కసారి కూడా ఎందుకు పరిశీలించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్ల కోసమే పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారన్నారు. ఎన్నికల కోసమే కేసీఆర్ అంబేడ్కర్ నామస్మరణ చేస్తున్నారని, ఎన్నికలు ముగిశాక అంబేడ్కర్ గుర్తురారని దళిత సమాజం గుర్తుంచుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ నిధులు నిలిపివేయడం వల్లే దళితులే ఎక్కువ నష్టపోతున్నారని బండి సంజయ్ అన్నారు. అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఆర్టికల్ 317, దేశ విభజనను అంబేడ్కర్ వ్యతిరేకించటం వలనే కాంగ్రెస్ ఆయనను ఓడించిందని తెలిపారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వటానికి వాజపేయి, అద్వానీనే కారణమని బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం దళితులను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేస్తోందన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లటానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు.