విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం- ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో ఇకపై తెలంగాణ ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో భాగం కానుంది.
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ చెప్పేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. సుమారు నెల రోజులకుపైగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో ఇకపై తెలంగాణ ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో భాగం కానుంది.
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును ఆగస్టు ఆరున తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత దీన్ని గవర్నర్‌కు పంపించారు. దీనిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న గవర్నర్ ఇవాళ ఆమోదించినట్టు ప్రకటించారు.
గవర్నర్ ఈ బిల్లు ఆమోదించడంతో 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుంది. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామని, ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు అదే విధంగా ఉంటాయంది. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించి పదవి విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏడాది రూ.3000 కోట్లు అదనపు బారం పడనుంది.
ఆర్టీసీ బిల్లు అసెంబ్లీ పెట్టే సమయంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది బేసిక్‌గా ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లు కావడంతో సభలో పెట్టక ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ టైంలో బిల్లులో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుమతి ఇచ్చేందుకు గవర్నర్ అంగీకరించలేదు. సభ ఆఖరి రోజు కూడా ఆమోదం లభించదేమో అని గ్రహించిన ఆర్టీసీ సిబ్బంది రాజ్‌భవన్ వద్ద ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచిన గవర్నర్ తనకు ఉన్న అనుమానులు వారికి వివరించారు.
వాటిపై స్పందించిన ప్రభుత్వం ఫైనల్ కాపీలో అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. చివరకు ఆఖరి నిమిషంలో సభ ముందుకు ఆర్టీసీ విలీనం బిల్లు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... గవర్నర్ తమిళిసై తెలిసీ తెలియక వివాదం చేశారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు ఆరోపణలు చేశారని, కానీ తాము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. త్వరలో ఆర్టీసీ సేవలు విస్తరిస్తామని, యువ ఐఏఎస్‌లను నియమించి మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.