(Source: Poll of Polls)
Telangana FCI RiceMill Attacks : ధాన్యం అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి ఎఫ్‌బీఐ ! కిషన్ రెడ్డి చెప్పినట్లే
తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మాయమైన ధాన్యం లోగుట్టు కనిపెట్టనున్నారు. టీఆర్ఎస్ - బీజేపీ ధాన్యం సవాళ్ల కారణంగా ఈ తనిఖీలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరాటానికి కారణం అయిన బియ్యం సేకరణ అంశంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయాలని కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) ని ఆదేశించినట్లుగా కొద్ది రోజుల కిందట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఎఫ్‌సీఐ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో తనిఖీలు ప్రారంభించారు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన రైస్ మిల్లులు... గడువు ముగిసినప్పటీ ధాన్యం ఇవ్వకపోవడంతో ఎఫ్‌సీఐ సోదాలు చేపట్టింది. ఏక కాలంలో 60 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి. మిల్లర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ ఫిర్యాదు చేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో రైస్ మిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది.
మార్చి 22 – 24 తేదీల మధ్య ఎఫ్ సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో భౌతిక తనిఖీలు చేపట్టారు. 2020 – 21 యాసంగి, 2021 – 22 వానాకాలం పంటకు సంబంధించిన ధాన్యం నిల్వల విషయంలో ఈ తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా…కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4,53,896 బస్తాల ధాన్యం భౌతికంగా లేకపోవడాన్ని ఎఫ్ సీఐ అధికారులు గుర్తించారు. 50 కేజీల బస్తా చొప్పున ఇది 2,26,948 క్వింటాళ్ల కింద లెక్క. దీని విలువ సుమారు రూ.45 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో 30 శాతం మేర అవకతవకలు జరుగుతున్నట్టు ఎఫ్ సీఐ అధికారులు గుర్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైంది. ఇప్పుడు అన్ని మిల్లుల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. గల్లంతయిన బియ్యం అంతా ఎక్కడికి వెళ్లింది ? దీని వెనుక ఏదైనా పెద్ద స్కామ్ ఉందా అన్న విషయాలపైనా ఆరా తీయనున్నారు. ఇప్పటికే ఈ అంశం తెలంగాణలోని రెండు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. ఆలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ లేఖలు రాశారు. సీబీఐ విచారణ చేయించుకోవచ్చని మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఎఫ్‌సీఐ తనిఖీలు కలకలం రేపుతున్నాయి.
రాజకీయ గొడవలు తమకు లేనిపోని చిక్కులు తెచ్చి పెడుతున్నాయని రైస్ మిల్లర్లు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ తనిఖీల్లో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఎక్కువ మంది మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.