Eatala Rajender: సింగరేణిని భ్రష్టు పట్టించి ప్రధాని మోదీ పర్యటన వేళ నిరసనలు సరికాదు?: ఈటల రాజేందర్
Eatala Rajender: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలువు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.
Eatala Rajender: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలకు పిలుపు ఇవ్వడాన్ని మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండిచారు. సింగరేణి మీద చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా తాము వస్తామని వివరించారు. నిజాయితీ ఉంటే రావాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఈటలతో పాటు మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ అధ్యక్షులు అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి శుబాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈటల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిసారి తనకు చేతకాని పనిని పక్కవారి మీదకు నెట్టడం అలవాటు అంటూ విమర్శించారు. 11 వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడానికి ప్రధాని వస్తుంటే ఆ సమావేశంలో పాల్గొనకుండా, ప్రధానిని రాష్ట్రానికి అహ్వనిచకుండా.. సింగరేణి మీద అబద్ధపు ప్రచారం ఎత్తుకున్నారని ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించవచ్చు కానీ సింగరేణి వారికి నిజాలు తెలుసని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. మీకు దమ్ముంటే సింగరేణి మీద చర్చకు రండి అని అసెంబ్లీ వేదికగా సవాలు విసిరితే.. పత్తా లేకుండా పోయారని అన్నారు. మరోసారి సవాలు విసురుతున్నానని.. మీకు నిజాయితీ ఉంటే చర్చకి రండి అని వ్యాఖ్యానించారు. 6300 కోట్లతో రామగుండంను తిరిగి ప్రారంభించిన సందర్భంగా.. 51 శాతం రాష్ట్రం వాటా ఉన్న తర్వాత కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు గుర్తు చేశారు. దానికి సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్... ఇప్పుడు మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మైన్స్ మినరల్స్ రెగ్యులేషన్ ఆక్ట్ 1957 ప్రకారం యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా 216 మైన్స్ కేటాయించడం వల్ల లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగింది అని కాగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అలాగే 216 మైన్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. దీని ఆధారంగానే మోదీ సర్కార్ 2015లో ఎంఎంఆర్డీ యాక్ట్ ని సవరణ చేసిందన్నారు. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. కొత్త చట్టం ప్రకారం మూడు పద్దతుల్లో బొగ్గుగనుల కేటాయింపు చేస్తున్నారని తెలిపారు.
1. సిమెంట్, ఐరన్, కోల్ ఆధారిత పరిశ్రమలకోసం క్యాపిటివ్ మైన్స్ కి అవకాశం ఇచ్చింది.
2. ఆదాయంలో 14 % రాయల్టీ కడితే టెండర్ లేకుండా డైరెక్ట్ గా మైన్స్ కేటాయింపు.
3. వేలం పాట. ( ఆదాయంలో 4% రాయల్టీ కట్టాలి)
ఈ పద్దతి తరువాత కోల్ ఇండియా దేశవ్యాప్తంగా 116 మైన్స్ అల్లోకేట్ చేసుకుందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో కూడా నయిని, న్యూ పాత్రపద, పెనగడప మైన్స్ సింగరేణికి కేంద్రం అలాట్ చేసిందన్నారు. అయితే తెలంగాణలో ఉన్న నాలుగు మైన్స్ కోసం కేసీఆర్ ఒక్క మాట కూడా అడగలేదన్నారు. కేకే6 15.84 మిలియన్ టన్నులు, శ్రావణ పల్లి 160 మిలియన్ టన్నులు, కోయాగుడ 119 మిలియన్ టన్నులు, సత్తుపల్లి 69.53 మిలియన్ టన్నులు కూడా ఒక్క అప్లికేషన్ పెట్టుకోలేదన్నారు. 2019 తరువాత ఓపెన్ ఆక్షన్ లో సింగరేణి ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. టెండర్ ఫామ్ కొన్న తరువాత కూడా ఎందుకు టెండర్ వెయ్యలేదో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. ఎవరికి మేలు చేయడానికి పాల్గొనలేదు తెలియజేయాలంటూ పైర్ అయ్యారు.
అరబిందో శరత్ చంద్ర రెడ్డి కోయాలగుడెం 119 మిలియన్ టన్నుల మైన్ ను ఎలా దక్కించుకున్నారు జగమెరిగిన సత్యం అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. అలాగే రాష్ట్రం వచ్చినప్పుడు 3500 కోట్ల బ్యాంక్ నిల్వలతో ఉన్న సింగరేణి ఇప్పుడు 10 వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 20 వేలకోట్ల అప్పు ఉందని.. 17 వేల కోట్ల విద్యుత్ బకాయిలు అయితే, మూడు వేల కోట్లు బొగ్గు బకాయిలు అని వివరించారు.
నిల్వలు ఉన్న సింగరేణిని ధ్వంసం చేసిన పాపం మీది కాదా ?
లక్షా 21 వేల ఉద్యోగాలతో కళకళలాడిన సింగరేణిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 63 వేల మందికి తగ్గించింది అని కేసీఆర్ విమర్శించారు. మరి మీ హయాంలో 63 వేల మంది ఉద్యోగులు ఉన్న సింగరేణి 43 వేల మందికి పడిపోయిందన్న విషయం మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. అలా అని బొగ్గు ఉత్పత్తి తగ్గిందా అంటే.. 51 మిలియన్ టన్నుల నుండి 65 మిలియన్ టన్నుల పెరిగిందన్నారు. అంటే సింగరేణి కార్మికులను తగ్గించి ప్రైవేట్ పరం చేస్తుంది మీరంటూ ఆరోపించారు. ప్రైవేట్ కంట్రాక్టర్స్ కి కట్టబెట్టే ప్రయత్నం చేశారని.. 99 శాతం పనులు కాంట్రాక్ట్ కి ఇస్తున్న నీచ చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. కోల్ మైన్స్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో రోజుకు 930/ ఇస్తే, కేసీఆర్ హయాంలో సింగరేణి 430/- మాత్రమే ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు.
కార్మికుల కడుపు కొడుతుంది కేసీఆర్ అంటూ దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ప్రైవేటుకి ఇవ్వద్దని కొట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ వచ్చాక దానిని ఏఎంఆర్ సంస్థకు కేటాయించారని.. అది ఎవరి బినామీనో అందరికీ తెలుసని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ సింగరేణి మీద లేదుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మీద ఎక్కడ అయినా తాను చర్చకు సిద్దం అని ఎమ్మెల్యే ఈటెల ప్రకటించారు. ప్రధాని వస్తే తప్పు దోవ పట్టిస్తున్నారని.. నిరసన చెప్పడం నీచం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోసపు మాటలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని.. సీఎం కేసీఆర్ కు ప్రజలు సరైన సమయంలో కర్రుకాల్చి వాత పెడతారు అని ఈటల రాజేందర్ అన్నారు.