Khanapur Municipality: కాంగ్రెస్ ఖాతాలోకి ఖానాపూర్ మున్సిపాలిటీ, నెగ్గిన అవిశ్వాస తీర్మానం
Congress Won Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్‌లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో కొత్త చైర్మన్, వైఎస్ చైర్మన్ ల ఎన్నిక త్వరలోనే నిర్వహించనున్నారు.
Congress party Won No Confidence Motion- ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పైన కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం నెగ్గింది. దాంతో ఖానాపూర్ మున్సిపాలిటీని అధికార పార్టీ కాంగ్రెస్ (Congress Party) కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి, అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు.
హైకోర్టు స్టే ఎత్తివేయడంతో అవిశ్వాస పరీక్ష..
గత నెల (జనవరి) 5వ తేదీన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఉత్తర్వులతో అవిశ్వాస పరీక్ష కొన్ని రోజులు వాయిదా పడింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో సోమవారం ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. 12 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ రాజేందర్, వైస్ ఛైర్మన్ ఖలీల్‌లకు వ్యతిరేకంగా 9 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఏకమై వారికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో కాంగ్రెస్ ఖాతాలో ఖానాపూర్ మున్సిపాలిటీ చేరిపోయింది.
బీఆర్ఎస్‌కు షాకిచ్చిన కౌన్సిలర్లు..
కాంగ్రెస్ కౌన్సిలర్లు, రాజురా సత్యం, గుగ్లవత్ కిషోర్ నాయక్, ఫౌజియా బేగం, ఆఫ్రీనా ఖానం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కావలి సంతోష్, జన్నారపు విజయలక్ష్మి, పరిమి లత, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు నాయిని స్రవంతి, తొంటి శ్రీనివాస్ తొమ్మిది కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లపై పెట్టిన అవిశ్వాసం నెగ్గిన తరువాత ఆర్డీవో రత్న కల్యాణి మాట్లాడుతూ.. జనవరి 2 న కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ ను కోరారని, ఫిబ్రవరి 5 అవిశ్వాసం నిర్వహించడం కోసం కౌన్సిలర్లకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 మంది సభ్యులు, ఒక ఎక్స్ ఆఫీషియో ఉన్నారని, అవిశ్వాసానికి టూ థర్డ్ ఫోరమ్ ఉండాలని తెలిపారు.
ఖానాపూర్ మున్సిపాలిటీ మీటింగ్ హాల్‌లో 9 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. మొదట చైర్మన్ అంకం రాజేందర్ పైన, తరువాత వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పైన అవిశ్వాసం నిర్వహించగా 9 మంది కౌన్సిలర్స్ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారని, దీంతో తీర్మానం నెగ్గిందని ఆమె ప్రకటించారు. ఈ ప్రతులు జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని, తర్వాత ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో ఖానాపూర్ మున్సిపాలిటీలో హస్తం జోరు పెరిగింది. ఎట్టకేలకు మరో మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. త్వరలో రాజురా సత్యంను ఛైర్మన్ గా ఎన్నుకోనున్నట్లు సమాచారం.
Also Read: అవసరం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు