Congress MP Tickets : తెలంగాణ కాంగ్రెస్‌లో తెగని టిక్కెట్ల పంచాయతీ - ఢిల్లీకి రేవంత్, భట్టి విక్రమార్క
Telangana Politics : లోక్‌సభ అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఇంకా ఎనిమిది సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది.
![Congress MP Tickets : తెలంగాణ కాంగ్రెస్‌లో తెగని టిక్కెట్ల పంచాయతీ - ఢిల్లీకి రేవంత్, భట్టి విక్రమార్క Congress lagging behind in finalizing Lok Sabha candidates Congress MP Tickets : తెలంగాణ కాంగ్రెస్‌లో తెగని టిక్కెట్ల పంచాయతీ - ఢిల్లీకి రేవంత్, భట్టి విక్రమార్క](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/ae844295ec39b00c2a11a9dcaf1cb0091711541918089228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress lagging behind in finalizing Lok Sabha candidates : పెండింగ్‌లో ఉన్న సీట్లను ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికి 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మిగిలిన ఎనిమిది మందిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పెండింగ్‌లో ఉన్న 8 సీట్లలో మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు.
పోటీ తీవ్రంగా ఉండడటంతో హైకమాండ్ దే తుది నిర్ణయం
సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేదానిపై దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, సుగుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్ నుంచి సాంబయ్య, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌కు తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ భార్య నందిని పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి నీలం మధు పోటీకి ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం, భువనగిరి టిక్కెట్ల పంచాయతీ ఇప్పుడల్లా తేలుతుందా ?
ముఖ్యంగా ఖమ్మం, భువనగిరి టిక్కెట్ల విషయంలో చాలా తీవ్రమైన పోటీ ఉంది. ఖమ్మం నుంచి ప్రసాద్ రెడ్డి, నందినిలలో ఎవర్ని ఎంపిక చేసిన మరొకరు తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ మంత్రుల కుటుంబసభ్యులు కావడమే దీనికికారణం. రేసులో ఎక్కువమంది ఉండడంతో చివరి క్షణంలో అభ్యర్థులను మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రమే పెండింగ్ అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ హిందూ అభ్యర్థిని ప్రకటించింది. మజ్లిస్ కు మేలు చేసేందుకు ఇలా చేసిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థిని పెడుతుందా.. లేక మజ్లిస్ కు సహకరిస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
రేవంత్ ఆధ్వర్యంలో ప్రచారం వ్యూహం
మరోవైపు ప్రచార వ్యూహంపై ఈనెల 29న శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్‌లో పీసీసీ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. మరోవైపు ఎన్నికల హీట్ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి గాంధీభవన్‌కు వచ్చి నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)