CM Revanth Reddy: మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు - పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానన్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: ఎవరివో మాయమాటలు నమ్మి పరిశ్రమలను, అభివృద్ధిని అడ్డుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దని అన్నారు.
CM Revanth Reddy Comments In Rythu Panduga Event In Mahabubnagar: మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని.. ఇంటికో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం తలరాత మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మహబూబ్‌నగర్‌లో (Mahabubnagar) ఏర్పాటు చేసిన 'రైతు పండుగ' సభలో శనివారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటివరకూ రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని.. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. 'సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి.. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు వలస వెళ్లాయి. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేసిందా.?. ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. అన్నదాతలకు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీది.' అని రేవంత్ తెలిపారు.
'అవకాశాన్ని వదులుకోవద్దు'
తన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని తాను భావించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 'గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా.?. ప్రాజెక్టులు కట్టలేదా..?. పరిశ్రమలు నిర్మించలేదా.?. మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. వారి మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారు. జిల్లా అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చేయాలా..? వద్దా..?. అధికారులను కొడితే.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవా.?. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చెప్పిన మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇంటికో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం తలరాత మారుతుంది. నష్టపరిహారం ఎక్కువ ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు. పాలమూరు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాను.' అని సీఎం స్పష్టం చేశారు.
'ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం'
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినవేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, యువతకు ఉద్యోగాల కోసమని.. గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులన్నీ క్రమంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 'ప్రతి నెలా సమీక్షలు చేస్తూ బిల్లులు చెల్లిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి పదేళ్లలో కూడా పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. నెల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశాం.' అని భట్టి వివరించారు.
Also Read: Anti Maoism Movement: అడవుల్లో యాంటీ మావోయిజం - ములుగు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు