Anti Maoism Movement: అడవుల్లో యాంటీ మావోయిజం - ములుగు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
Telangana: ములుగు ఏజెన్సీలో యాంటీ మావోయిజం ట్రెండ్ నడుస్తోంది. వారికి వ్యతిరేకంగా గిరిజనులు పోస్టర్లు వేస్తున్నారు.
Anti Maoism trend is running in Mulugu Agency: ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు చర్చనీయాంశంగా మారాయి. సరిగ్గా వారం రోజుల క్రితం మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా గడిచిన కొన్ని నెలల నుండి ఆందోళనలు, వాల్ పోస్టర్లు వెలువడుతున్నాయి.
ఏజెన్సీలో గిరిజనుల నిరసన
ములుగు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాల కలకలం రేపుతున్నాయి. ఆదివాసీ ఐక్యవేదిక, యువజన సంఘాల పేరుతో ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో గోడలకు వాల్ పోస్టర్లు, రోడ్లపై కరపత్రాలు వెలిశాయి. ఈ నెల 21 వ తేదీన ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో గిరిజనులైన ఉయిక అర్జున్, రమేష్ లను పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు.హత్యలకు, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి ఐక్యవేదిక, యువజన సంఘాల పేరుతో వాల్ పోస్టర్లు వేయడం జరిగింది. అమాయక ఆదివాసీలను భయపెట్టి సరుకులు, సామాగ్రి తెప్పించుకుంటూ తిరిగి అదే ఆదివాసి ప్రాణాలను తీస్తున్నారని కరపత్రాలలో పేర్కొన్నారు. అమాయక ఆదివాసి బిడ్డలను చంపే మావోయిస్టులకు సహకరించవద్దని వాల్ పోస్టర్లలో రాషాకుయ
వారంరోజుల్లో రెండవ సారి నిరసన.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ములుగు జిల్లా ఏజెన్సీ భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా గడిచిన కొద్దిరోజుల్లో ఆందోళన చేయడం రెండవసారి. గత శనివారం రోజున గిరిజనుల హత్య ఘాతుకాన్ని ఖండిస్తూ సుమారు 2 వేల మంది గిరిజనులు ఏటూరు నాగారం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులు డౌన్ డౌన్ అనే ప్లేకార్డ్ లు, బ్యానర్లు పట్టుకొని గిరిజనులు ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ములుగు జిల్లాలోని గిరిజనులతో పాటు ఛత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చిన గోత్తికోయ గిరిజనులు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు.
Also Read: కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
జూన్ నెలలో సైతం మావో వ్యతిరేక ఆందోళన
పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 3వ తేదీన కొంగల అటవీప్రాంతంలో వంట చెరుకు కోసం ఇల్లందుల ఏసు అనే వ్యక్తి వెళ్ళాడు. వంటచెరుకు సేకరిస్తున్న క్రమంలో ప్రెజర్ బాంబు పేలి మృతి చెందాడు. జూన్ 13న కర్రెగుట్ట అడవిలోని బెదంగుట్ట సమీపంలో ఉన్న శివాలయం దర్శనానికి వెళ్తున్న సునీతా అనే మహిళ. మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి తీవ్రంగా గాయాలు కావడంతో వైద్యులు సునీత కాలును తొలగించాల్సి వచ్చింది. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ఏసు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు వాజేడు మండలం జగన్నాధపురం లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన లు తెలిపారు.
వరుస ఆందోళనలు.
ఈ ఏడాది జూన్ నెల నుండి మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు చేయడం, గిరిజనుల ఐక్యవేదిక వాల్ పోస్టర్లు అతికించడం, కరపత్రాలు వదిలి వెళ్తున్నారు. అయితే మావోయిస్టులు గిరిజనుల ఆందోళనలకు ఎలాంటి వివరణ ఇస్తారో వేచిచూడాలి. గిరిజనుల నిరసన, ఆందోళనల వెనుక పోలీసుల ప్రమేయం ఉందనే ప్రచారం లేకపోలేదు.