CM Revanth Reddy: 'కొత్త ఆవిష్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులు' - ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, రోడ్ మ్యాప్ ఆవిష్కరణ
Hyderabad News: సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని.. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్‌లా ఏ నగరమూ సిద్ధంగా లేదని సీఎం రేవంత్ తెలిపారు. గ్లోబల్ ఏఐ సదస్సులో రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు.
Global AI Summit In Hyderabad: కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని.. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 'గ్లోబల్ ఏఐ' సదస్సుకు (Global AI Summit) సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. కొత్త ఆవిష్కరణలు ఆశలతో పాటు భయాన్ని తీసుకొస్తాయని.. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదని అన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని.. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్‌కు రూపకల్పన జరుగుతుందని చెప్పారు. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని అన్నారు.
A notable meeting took place at HICC, Hyderabad , where J-Pal Global Executive Director Mr @iqbaldhali engaged in a valuable discussion with the Chief Minister Sri @revanth_anumula of #Telangana on the global AI landscape. IT Minister Sri. @OffDSB and senior officials were also… pic.twitter.com/0UPbetPpXK
— Telangana CMO (@TelanganaCMO) September 5, 2024
'అది మన అదృష్టం'
'సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారింది. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్.. ఇలా ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఆధునిక సాంకేతికతతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం మన తరం చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచ సాంకేతిక రంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుంది. అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం. దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయాం. భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే.. హైదరాబాద్ సిటీలా మరే సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదు. ఇందుకు సంబంధించిన సవాళ్లను స్వీకరించడమే కాదు. భవిష్యత్తును సృష్టిస్తాం. హైదరాబాద్‌ను AI హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఏఐలో పట్టు సాధించబోతున్నామని.. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డీప్ ఫేక్ లాంటి ఘటనలు జరగకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని.. ప్రపంచ స్థాయి యూనివర్శిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఎథికల్ ఏఐ విషయంలో జపాన్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాబోయే 2 రోజులు హెచ్ఐసీసీ వేదికగా ఏఐపైనా చర్చలు,స సెమినార్లు ఉంటాయని అన్నారు.
Also Read: Telangana: తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్- ఆరుగురు మావోయిస్టులు మృతి