Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Telangana News: యాదాద్రి పేరు మారింది. ఇకపై అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy Key Decision On Yadagirigutta Temple Board: యాదాద్రి పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా (Yadagirigutta) మార్చారు. ఇకపై అన్ని రికార్డుల్లోనూ యాదాద్రి బదులుగా యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు (Yadagirigutta Temple Board) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. టీటీడీ స్థాయిలో యాదగిరిగుట్ట బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (#TTD) తరహాలో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి… pic.twitter.com/m9V1XVPtnh
— Telangana CMO (@TelanganaCMO) November 8, 2024
సీఎం కీలక ఆదేశాలు
గో సంరక్షణకు గోశాలలో ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. 'భక్తులు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు పూర్తి చేయాలి. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో రావాలి. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించాలి.' అని అధికారులకు నిర్దేశించారు.