KCR Delhi Tour: ఢిల్లీలో ఆ ముగ్గుర్నీ కలిసే యోచనలో కేసీఆర్.. ఆ తర్వాతే హైదరాబాద్‌కు..
సీఎంవో కార్యాలయం ముగ్గురి అపాయింట్‌మెంట్ కోరింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను కేసీఆర్ కలవాలని ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎంవో కార్యాలయం ముగ్గురి అపాయింట్‌మెంట్ కోరింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను కేసీఆర్ కలవాలని ప్రయత్నిస్తున్నారు. వారిని కలిసిన తర్వాతే సీఎం కేసీఆర్ హైదరాబాద్ రావాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ ముగ్గురు అపాయింట్‌మెంట్లను సీఎంవో ఇప్పటికే కోరగా.. ప్రధాన మంత్రి మోదీ, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను శుక్రవారమే కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శనివారం అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముగ్గురిని కలిసిన అనంతరం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు వర్గాలు వెల్లడించాయి.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై జారీ చేసిన గెజిట్, వివిధ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ చర్చించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే పలువురు నిపుణులు, అధికారులతో హైదరాబాద్‌లో ఉండగానే సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు మంత్రికి వివరించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rain In Hyderabad: హైదరాబాద్ లో జోరువాన.. ఆకాశానికి చిల్లు పడిందా ఏంటీ?
ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు శంకుస్థాపన
రాజధానిలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం దీనికి భూమి పూజ చేశారు. ఢిల్లీలో పార్టీ భవనం నిర్మాణం కావడం ఓ మైలురాయిగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణం కోసం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం ఈ స్థలం కేటాయించింది. గతేడాది అక్టోబరు 9న వసంత విహార్ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు వెయ్యి చదరపు గజాలకు పైగా భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నవంబరు 4న టీఆర్ఎస్‌కు కేంద్రం అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా అప్పటి నుంచి టీఆర్ఎస్ వర్గాలు వేచి చూశాయి. అప్పటి నుంచి మంచి ముహూర్తం కోసం వేచి చూసి ఇవాళ భూమి పూజ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
Also Read: Khammam: ఊరెళ్లిన మహిళ.. ఇంటికొచ్చి తలుపు తీయగానే హడల్! ఏం జరిగిందంటే..