Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఏపీ-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 - 3.1 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉందని తెలిపింది. దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టం నుంచి 3.1- 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీంతో శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లండించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: Rain In Hyderabad: హైదరాబాద్ లో జోరువాన.. ఆకాశానికి చిల్లు పడిందా ఏంటీ?
రాయలసీమలో
రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నల్కొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి-భువనగిరి, సూర్యపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?