KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !
వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . వినతి పత్రాన్ని విసిరికొట్టారని అంటున్నారు
KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టి.. డ్రామాలాడుతున్నారా అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండలో డిమాండ్లు నెరవేరుస్తారేమోననే ఆశతో సీఎం కేసీఆర్ ను కలిసిన వీఆర్ఏ సంఘం నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. వినతులు ఆలకిస్తారనుకున్న ముఖ్యమంత్రి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతిపత్రాన్ని వీఆర్ఏ సంఘం నాయకులపైకి విసిరారు. ‘‘డ్రామాలాడుతున్నరా.. మీరు అనవసరంగా సమ్మె చేస్తున్నరు. మీకేం పనిలేదా ?’’ అంటూ కోపాన్ని వెళ్లగక్కారు. ఈ ఘటన హన్మకొండలోని టీఆర్ఎస్ సీనియర్ నేత, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో చోటుచేసుకుంది.
కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటి వద్ద వీఆర్ఏలపై కేసీఆర్ ఆగ్రహం
వరంగల్ నగరంలో ప్రతిమ హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత సీఎం కేసీఆర్ హన్మకొండకు వస్తుండగా మార్గం మధ్యలో మేం ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. అప్పుడు కాన్వాయ్ ఆపిన కేసీఆర్ వారి వద్ద నుంచి వినతి పత్రం తీసుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మేం అక్కడికి కూడా వెళ్లి టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడు, ఎమ్మెల్యే సతీశ్ ద్వారా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మరోసారి వీఆర్ఏలు ప్రయత్నించారు. అక్కడ మళ్లీ మేం సీఎం కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేసీఆర్ కి వినతి పత్రం అందించారు. తమ సమస్యలను సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే మీరు అనవసరంగా సమ్మె చేస్తున్నారని ముఖం మీదికి విసిరేశారని వీఆర్ఏలు చెబుతున్నారు.
గ్రామాల్లో కీలక విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం వీఆర్ఏల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదు. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు దాటినా..వీఆర్ఏల సమస్యలు తీరడం లేదు. గ్రామాల్లో చెరువులు, ప్రభుత్వ భూములు, సహజ సంపదల రక్షణ చూసేది వీఆర్ఏలే. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి అందించేది వీఆర్ఏలే. ప్రభుత్వ 36 శాఖలకు సంబంధించి ఏ అధికారి వచ్చినా.. రిసీవ్ చేసుకునేది వీఆర్ఏలే. గ్రామాల్లో శాంతి భద్రతలను గమనిస్తూ.. పోలీసులకు సాయం చేసేది వీఆర్ఏలే. ఇన్ని పనులు చేస్తున్న తమకు సరైన జీత భ త్యాలు అందడం లేదని వారు ఆందోళన చేస్తున్నారు.
పే స్కేలు అమలు చేయాలని కొంత కాలంగా ఉద్యమాలు
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేలు అమలు చేయాలి. అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలి. మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి. వీఆర్ఏల సమ్మెతో రెవెన్యూ శాఖలో చాలా పనులు పెండింగ్లో పడుతున్నాయి. వివిధ శాఖల పనులకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. వీఆర్ఏలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వంపై వారు పోరాడుతున్నారు.