BRS In Crisis : సంక్షోభం అంచున బీఆర్ఎస్ - ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారా ?
Telangana Politics : బీఆర్ఎస్ పార్టీ పెను సంక్షోభంలో కూరుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
BRS party is going into a big crisis : భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా అలజడి రేగుతోంది. ఊహించని విధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడిపోయింది. ఆయన ఇంటి మందు ధర్నా చేసేందుకు బాల్క సుమన్ నేతృత్వంలో కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. కానీ ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ... కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. దీంతో.. పార్టీ నుంచి వలసలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయన్న అభిప్రాయం కలుగుతోంది.
కాంగ్రెస్ , బీజేపీల వైపు చూస్తున్న నేతలు
పార్టీ ముఖ్య నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో చాలా మంది నేతలు రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి వారిపై ఒత్తిడి వస్తోంది.ప్రస్తుతం 35 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో ఉన్నారు. వీరిలో కనీసం ఇరవై మందిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మిగతా వారిపై బీజేపీ వల విసురుతోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ దాడులు రాజకీయమేనని అనుకుంటున్నారు.
కేసీఆర్ బుజ్జగింపులను పట్టించుకోని ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల కిందట నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. కానీ వారెవరూ పార్టీలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.పార్టీ మారుతారని భావిస్తున్న మరికొంత మంది ఎమ్మెల్యేలతోనూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. అయితే చాలా మంది స్పందించడం లేదు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహా చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల నాటికి కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారా ?
పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశం కాబోతోంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవ్వాలని అనుకుంటున్నారు. అంతకు ముందే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా పోయేలా చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. . బీజేపీ కూడా ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రధాన ప్రతిపక్షంగా తామే వ్యవహరించాలని బీజేపీ అనుకుంటోందని అంటున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమకలాకర్ ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.ఎమ్మెల్యేలు కాకుండా ఇతర పార్టీ ముఖ్య నేతలు కూడా వలస బాటలో ఉండటం బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టేదే. ఈ సంక్షోభాన్ని కేసీఆర్ ఆపగలుగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల వరకూ బలంగా ఉన్న బీఆర్ఎస్..ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో పరిస్థితి ఒక్క సారిగా తిరగబడింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు వేసుకుంటే.. ఒక్క ఓటమితో సొంత రాష్ట్రంల ోపాల్టీ నేతల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది.