Congress Joinings : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ముఖ్య నేత - కూకట్ పల్లి టిక్కెట్ ఆఫర్ !
బీఆర్ఎస్ కీలక నేత బండి రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూకట్ పల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
Congress Joinings : భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బస్సుయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శేరిలింగం పల్లి నుంచి బీఆర్ఎస్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు గ్రేటర్ మేయర్ పదవిని ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఆయన.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కొరత ఉండటం సామాజిక వర్గ పరంగా కలసి వచ్చే నేత కావడంతో బండి రమేష్ కు టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున శేరిలింగంపల్లి అసెంబ్లీ నుండి పోటీ చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.
మూడు రోజుల కిందట కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కీలక బీఆర్ఎస్ నేత
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ కీలక నేత కూడా మూడు రోజుల క్రితమే పార్టీ మారారు. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పేట కార్పొరేటర్ పూజిత గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసే అవకాశం ఉంది. జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. శేరిలింగంపల్లిలో బలమైన నేత కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ వారు వచ్చి చేరడంతో అభ్యర్థి సమస్య తీరినట్లయింది. 2015 వరకూ వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు.
కూకట్ పల్లి అభ్యర్థిగా బండి రమేష్ ను ఖరారు చేసే అవకాశం
కూకట్ పల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావు బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. ఆయితే ఆయన ఏ విషయాన్ని తేల్చకపోవడంతో..చివరికి బండి రమేష్ ను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో బీఆర్ెస్ నేతగా ఆయన చురుకుగా పర్యటించారు. పరిచయాలు కూడా ఎక్కువగా ఉండటంతో ఆయననే కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరికొంత మంది కీలక నేతలు చేరుతారంటున్న కాంగ్రెస్
తుదిజాబితా ప్రకటించేలోపు మరికొంత మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న నేతలందర్నీ పార్టీలో చేర్చుకుంటున్నారు. సిట్టింగ్‌లకే.. కేసీఆర్ బీఆర్ఎస్ తరపున టిక్కెట్లు ప్రకటించడంతో ఆ పార్టీలో చాలా కాలంగా పని చేస్తూ... టిక్కెట్లు రాని వారందరూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.