(Source: ECI/ABP News/ABP Majha)
BRS News : వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ భేటీ - కాంగ్రెస్ పార్టీలో చేరే చాన్స్
Telangana : తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. గుత్తా అమిత్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
Gutta Amit is preparing to join Congress : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ గైర్హాజరయ్యారు. మంగళవారం ఉదయం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసమే అమిత్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ మొదలైంది. నల్లగొండ టికెట్ ను ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డికి ప్రకటిచింది. భువనగిరి స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమైనా వెనుకడుగు వేస్తున్న అమిత్
గుత్తా అమిత్ కు నల్లగొండ లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్న స్థానిక రాజకీయాల కారణంగా ఆయన తన కుమారుడ్ని కాంగ్రెస్‌లోకి పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తా వర్గయులకు సరిపడటం లేదు. టిక్కెట్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వర్గం సహకరించదన్న కారణంగా వారు బయటకు రావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే భువనగిరి టిక్కెట్ ను కాంగ్రెస్ రెడ్డి వర్గానికి కేటాయిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి
శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయినా.. ఇప్పటికీ తెలంగాణ శాసనమండలిలో... బీఆర్ఎస్ కే మెజార్టీ ఉంది. కీలకమైన బిల్లులు ఏమైనా మండలికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ వైపు మారిపోతే ఆ అడ్వాంటేజ్ లేకుండా పోతుంది.గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు పార్టీ మారకుండా ఉండేందుకు కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే గుత్తా కుటుంబీకులు స్పందించడం లేదని తెలుస్తోంది.
వలసల్ని ఆపడం బీఆర్ఎస్ చీఫ్ కు పెద్ద సమస్య!
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. రెండు జాతీయ పార్టీలు బలంగా కనిపిస్తూండటంతో ఆ పార్టీల వైపు మొగ్గుతున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ పార్టీలు మారిపోతూండటం ఆశ్చర్యకరంగా మారింది. ఈ పరిణామాల్ని ఎలా డీల్ చేయాలో తెలియక.. బీఆర్ఎస్ నేతలు తంటాలు పడుతున్నారు.