Medigadda Barrage: మేడిగడ్డ ఘటనపై బీజేపీ నో రెస్పాన్స్ - మొన్న మోదీ, ఇవాళ అమిత్ షా
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు రావడంపై ఇప్పటివరకు మోదీ, అమిత్ షా స్పందించలేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన జాతీయ అగ్రనేతలు.. ఆ అంశంపై నోరు మెదపడం లేదు.
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు రావడం, అన్నారం సరస్వతీ బ్యారేజీలో నీళ్లు లీక్ కావడం సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఈ ఘటనలు అధికార బీఆర్ఎస్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడి సరిగ్గా నిర్మాణం చేయలేదని, నాణ్యతా లోపం వల్లే కూలిపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర నిపుణుల బృందం.. నాణ్యతా లోపం వల్లనే కుంగిపోయిందని తేల్చేసింది. దీంతో ఎన్నికల వేళ ఈ పరిణామం బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టింది.
అయితే మేడిగడ్డ అంశంపై కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నా.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇటీవల బీసీ డిక్లరేషన్‌తో పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన విశ్వరూప మాదిగ సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి మోదీ వచ్చారు. ఈ సభల్లో కేసీఆర్‌పై విమర్శలు చేసిన మోదీ.. మేడిగడ్డ గురించి మాత్రం స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలోని ఈ కీలకం అంశంపై మోదీ మాట్లాడకపోవడం ఏంటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పేపర్ లీకేజీ, ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించిన మోదీ.. మేడిగడ్డ ఘటన గురించి మాత్రం నోరు మెదపలేదు. దీంతో బీఆర్ఎస్ పట్ల కేంద్రం మెతక వైఖరి ప్రదర్శిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేంద్ర బృందం వచ్చి మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. అయినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శనివారం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కానీ ఎక్కడా మేడిగడ్డ అంశం గురించి మాట్లాడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన అమిత్ షా.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రం మాట్లాడలేదు. దీంతో మేడిగడ్డ ఘటన గురించి కేంద్ర బీజేపీ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదనే చర్చ నడుస్తోంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీలో పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాను లేఖ రాయడం వల్లనే కేంద్ర బృందం వచ్చి మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిందని చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తోంది.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీనే పలుమార్లు ఆరోపించారు. మరి మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడటం లేదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలో లీకేజీ వచ్చి నీరు ఉబికి వచ్చింది. నీరు పైకి ఉబికి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు.. ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించారు. లీకేజీ వచ్చిన చోట ఇసుక, మెటల్ నింపిన సంచులు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 10.87 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం బ్యారేజ్ నిర్మించిన విషయం తెలిసిందే.