యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం
ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి ఐకేరెడ్డి
బాసర ఆలయం మహిమాన్విత క్షేత్రంగా రూపుదిద్దుకోబోతోంది. ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.150 కోట్ల నిధులతో బాసరను అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించారు.
బాసర! జ్ఞానసరస్వతీ అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రం! దేశంలో రెండే రెండు జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి జమ్మూలో ఉంటే, రెండో ఆలయం తెలంగాణలోని బాసరలో కొలువై ఉంది. జ్ఞాన సరస్వతీ అమ్మవారు- మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారిక్కడ. వేద వ్యాసుడు ఈ క్షేత్రాన్ని స్థాపించాడని స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత కాలంలో ఆలయం నిర్మితమైందని చరిత్ర చెబుతోంది. పుణ్యగోదావరి తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఈ కోవెల అలరారుతోంది. ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే బాగా చదువుతారని జనం నమ్మకం. జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండజ్యోతికి నూనె సమర్పించడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. బాసర క్షేత్రానికి నిత్యం పదివేలకు తగ్గకుండా భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు అక్షర శ్రీకార పూజలు వందల సంఖ్యలో అవుతుంటాయి. యేటా శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం
రాష్ట్రంలోని ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్.. నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయాన్ని కూడా దివ్యక్షేత్రంగా పునర్నిర్మించడానికి నడుం బిగించారు. సీఎం ఆదేశాల మేరకు బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ పీఠం నాచగిరి మధుసూదనంద సరస్వతీ స్వామి సమక్షంలో వివిధ పూజలు చేశారు.
బాసర ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8 కోట్ల వ్యయంతో 50 ఏసీ గదులను నిర్మించారు. వాటికి ఆన్ లైన్‌లో బుకింగ్ సదుపాయం కల్పించారు. శృంగేరీ పీఠం సూచనల ప్రకారం గర్భగుడి, నాలుగు రాజగోపురాలు, కోనేరు, మాడవీధులన్నీ పునర్నిర్మిస్తారు. యాదాద్రి ఆలయం తరహాలోనే బాసరలో కూడా పూర్తిగా కృష్ణశిలలనే ఉపయోగిస్తారు. గోదావరి దగ్గర భక్తుల పుణ్యస్నానాల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొత్తం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి యాదాద్రి తరహాలో బాసరను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
బాసర క్షేత్రానికి తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతీ రోజు భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం బాసర వరకు రైల్వే లైన్ ఉంది. తాజాగా ఫకీరాబాద్- భైంసా వరకు నేషనల్ హైవే కూడా మంజూరైంది. ఈ హైవే కూడా అందుబాటులోకి వస్తే, భక్తులు మరింత సులభంగా బాసర చేరుకోవచ్చు. మొత్తమ్మీద మరో వెయ్యి ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా బాసరను అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.
మాస్టర్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామని, ఆమోదం పొందగానే 15 రోజుల్లో టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మొదటి విడతలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే రూ. 50 కోట్ల నిధుల్లో రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాలను నిర్మించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.42 కోట్లు అందుబాటులో ఉండగా, మరో రూ.50 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఆలయ అధికారులు, అర్చకులు, ఇంజినీర్లతో కలిసి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించి అభివృద్ధి పనులపై చర్చించారు.