Bandi Sanjay: రేవంత్, హరీష్ రావు బకరాలు, తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం : బండి సంజయ్
Bandi Sanjay: ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు.
Bandi Sanjay: ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అనుచరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు. బీఆర్‌ఎస్ బండారాన్ని మోదీ బయట పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే అన్నారు. బీజేపీలో అసలైన నాయకులు చేరుతున్నారని అన్నారు. అడ్డా మీది కూలీలకు దాల్ రైస్ కూపన్లు ఇచ్చి బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
పెద్ద సార్ ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ లిస్ట్
సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బండి అన్నారు. తమ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ఢిల్లీకి వెళ్లిందని, కానీ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్లిందని ఎద్దేవా చేశారు. పెద్ద సార్ ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ లిస్ట్ వెయిట్ చేస్తోందని, పాపం ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలీదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరవెనుక చాలా విషయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వచ్చే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తోందని, అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రేవంత్, హరీష్‌లు ఇద్దరు బలిచ్చే బకరాలు అని కాంగ్రెస్‌లో బకరా రేవంత్ అయితే, బీఆర్‌ఎస్‌లో హరీష్ రావు అంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. అప్పుల్లో ఉన్న తెలంగాణ, ప్రజలు బాగుపడాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. అది నమ్మి చాలా మంది ముఖ్య నేతలు బీజేపీలో చేరుతున్నారని బండి చెప్పారు. రాబోయే రోజుల్లో చేరికలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గత ఉపఎన్నికల్లో బీజేపీని నమ్మి గెలిపించారని, ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు.
‘సీఎం కుర్చీ కోసం కేటీఆర్, హరీష్ కొట్టుకుంటున్నారు’
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని నువ్వు కొట్టు నేను ఏడుస్తా అన్న చందంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కేసీఆర్ 30 మంది డబ్బు ఇచ్చారని, ఎవరు గెలిచినా తన ఖాతాలో వేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలను గెలిపించుకోవాలని బీఆర్ఎస్‌కు లేదని, ఇండిపెండెంట్ గెలిచినా డబ్బు పంపించే అలవాటు కేసీఆర్‌ది అన్నారు.
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సీఎం కుర్చీ కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఇద్దరు మంత్రులు మేనిఫెస్టో పేరుతో సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యి కుర్చీ కోసం పోటీ పడుతున్నారని ఆరోపించారు. వీరిద్ధరి ప్రవర్తనతో కేసీఆర్ తల బాదుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైందని, అందుకే తెరవెనుక మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. పొరపాటున కూడా కేసీఆర్‌ను బీజేపీలోకి రానివ్వమంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.