Hyderabad News: 'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
Kodipunju Tribute: వేలంలో కోడి పుంజును దక్కించుకున్న వ్యక్తి దానికి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఘన సన్మానం చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఆ కోడిని కోయనని పెంచుకుంటానని సదరు వ్యక్తి తెలిపారు.

Great Tribute To Kodipunju In Hyderabad: ఓ వ్యక్తి వేలంలో కోడిని దక్కించుకున్నారు. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ దానికి ఘన సన్మానం చేశారు. ఆ కోడిని కోయనని.. తాను పెంచుకుంటానని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న మొయినాబాద్ (Moinabad) పీఎస్ పరిధిలోని అజీజ్‌నగర్ పోచయ్య తోట వెనుక కొందరు కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. 8 మందిని అరెస్ట్ చేసి రూ.10 వేల నగదు, ఓ కోడి పుంజు, 12 కోడికత్తులు, 5 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే, స్వాధీనం చేసుకున్న కోడిని మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు.
కోడికి వేలం
న్యాయ సలహా మేరకు కోడిని శనివారం రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం ఆ కోడిని వేలం వేయాలని ఆదేశించింది. ఈ వేలంలో మొత్తం 12 మంది పాల్గొనగా.. వేలంపాట రూ.300 నుంచి మొదలైంది. గగన్‌పహాడ్‌కు చెందిన రామకృష్ణ రూ.2,300కు పుంజును దక్కించుకున్నారు. ఈ కోడిని ఏం చేస్తావని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తన బంధువు పామ్‌లో పెంచుతానని తెలిపారు. కోడి పుంజును వేలం పాటలో ఇతరులు దక్కించుకుంటే కోసేస్తారనే భయంతోనే వేలంపాట పాడి దక్కించుకున్నట్లు చెప్పారు. కాగా, కోడిని దక్కించుకున్న రామకృష్ణ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. ఈ విషయం సహచరులు, స్నేహితులకు చెప్పిన ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కోడికి ఘన సన్మానం చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.





















