Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో విషాదం, వేర్వేరు చోట్ల ఆరుగురు మృత్యువాత
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పడుగులు పడ్డాయి.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పడుగులు పడ్డాయి. జయశంకర్ జిల్లలాలో మగ్గురు మృతి చెందారు. అలాగే ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పిడుగు పడడంతో మొబైల్ పేలి యువకుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి ఓ చిరు వ్యాపారి మృత్యువాత పడ్డారు. నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మత్యువాత పడింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. స్థానికుల వివరాల మేరకు.. చిట్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు సరిత(30), నేర్పాటి మమత(32), పర్లపెల్లి భద్రమ్మ, ఆరెపల్లి కొమరమ్మ, మైదం ఉమా, కుమార్ శాంతినగర్ శివారులో మంగళవారం మిరప మొక్కలు నాటేందుకు వెళ్లారు.
మధ్యాహ్న సమయంలో పని చేస్తుండగా పెద్ద వర్షం కురిసింది. దీంతో కూలీలంతా పని ఆపేసి తడవకుండా ఉండేందుకు చేను పక్కనే ఉన్న చెట్టు కిందికి వచ్చారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో సరిత, మమత అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108 వాహనంలో చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పనికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అలాగే కాటారం మండలం దామెరకుంటలో పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి రైతు రాజేశ్వర్‌రావు(46) మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో యువకుడి దుర్మరణం
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం విషాద ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగుపాటుకు గురయ్యారు. ఈ క్రమంలో జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.
ప్రకాశం జిల్లాలో కూడా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తురిమెళ్ళకు చెందిన మహమ్మద్ ఖాశిం బైక్ పై వెళ్తూ రాచర్ల మండలం అక్కపల్లి వద్ద ప్రవహిస్తున్న వాగులో పడి కొట్టుకుపోయాడు. మంగళవారం ఉదయం మృతదేహం సంఘటన స్థలానికి కొంత దూరంలో లభ్యమైంది. బంధువులు మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుని స్వగ్రామం గిద్దలూరు మండలం బురుజు పల్లె గ్రామం. కంభంలో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేసుకునేవాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మట్టి మిద్దె కూలి ఒకరు మృతి
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో గ్రామంలో మట్టి మిద్దె కూలి వనం నాగమ్మ (85) అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో వృద్ధురాలు శివనాగమ్మ (75) తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. దీనిపై నంద్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిమిద్దెలపై ప్రచారం చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన మహిళ కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.