Hyderabad News: భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
Telangana News: భారీ వర్షాలతో భాగ్యనగరంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రహరీ గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. విద్యుత్ షాక్ తో ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు.
14 People Died Due To Heavy Rains In Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షాల వల్ల మంగళవారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ (Bachupally Police Station) పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో షెడ్డులో నివసిస్తోన్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఇక్కడ గతంలో 10 - 15 అడుగుల ఎత్తు వరకూ ప్రహరీ నిర్మించగా.. తర్వాత దానినే 30 - 40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన ఆయన.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆరుగురి అరెస్ట్
ఈ ప్రమాదంలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఆరుగురిని అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్, కాంట్రాక్టర్ రాజేష్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.
విద్యుత్ షాక్ తో
మొయినాబాద్ మండలం చిన్నమంగళారానికి చెందిన జహేరాబేగం (47) మంగళవారం రాత్రి కూరగాయలు కొనేందుకు బయటకు రాగా.. ఆర్చ్ కూలి ఆమె తలపై పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. అలాగే, హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన అంజలి అనే మహిళ బుధవారం ఉదయం పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలో తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి భారీ గాలులకు కుంట్లూర్ సన్ రైజ్ కాలనీ రోడ్డు 3లో విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని గమనించిన ఆమె సమీపంలోని భవన నిర్మాణ కార్మికులను పిలవడానికి వెళ్లారు. ఈలోపు ఆటో దిగిన ఆమె కుమారుడు శివశంకర్ (5) విద్యుత్ తీగ తగలి విద్యుత్ షాక్ తో చనిపోయాడు. అటు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ కు చెందిన షేక్ పర్వేజ్ (40) వర్షంలో తన పంక్చర్ దుకాణం బయట ట్యూబ్ లైట్ తీస్తుండగా విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, చందానగర్ లోని గంగారంలో బీహార్ కు చెందిన దమేంద్ర కుమార్ యాదవ్ (33) తాను పని చేసే టీ బండిని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కడుతుండగా.. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. అటు, మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మంగళవారం రాత్రి వర్షానికి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు.