Samsung Galaxy Ring: మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ రింగ్ - గోల్డ్ రింగ్ కంటే కాస్ట్లీ - స్పెషాలిటీ ఏంటి?
Samsung Smart Ring: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ రింగ్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. దీని ధర రూ.38,999 నుంచి ప్రారంభం కానుంది. 5 నుంచి 13 వరకు వేర్వేరు సైజుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy Ring Launched: శాంసంగ్ గెలాక్సీ రింగ్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజ కంపెనీ దీనికి సంబంధించిన రిజర్వేషన్లను ఓపెన్ చేసింది. రూ.1,999 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్లో దీన్ని మొదట అనౌన్స్ చేశారు. ఈ స్మార్ట్ రింగ్ మూడు కలర్ ఆప్షన్లు, తొమ్మిది వేర్వేరు సైజుల్లో అందుబాటులోకి రానుంది. శాంసంగ్ మొదటి ఫిట్‌నెస్ రింగ్ ఇదే. ఏఐతో పని చేసే హెల్త్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్లతో ఇది మార్కెట్లోకి వచ్చింది. శాంసంగ్ హెల్త్ ప్లాట్‌ఫాంపై ఇది పని చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ధర
దీని ధర మనదేశంలో రూ.38,999 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్.కాం, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ రింగ్‌ను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు శాంసంగ్ అందించే సైజింగ్ కిట్ ద్వారా రింగ్ సైజును ఎంపిక చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ నెలకు రూ.1,625 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 18వ తేదీ లోపు కొనుగోలు చేస్తే 25W ట్రావెల్ అడాప్టర్ ఉచితంగా లభించనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
శాంసంగ్ గెలాక్సీ రింగ్ స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ రింగ్ 5 నుంచి 13 వరకు వివిధ సైజుల్లో అందుబాటులో ఉండనుంది. ముందే తెలిపినట్లు శాంసంగ్ అందించే సైజింగ్ కిట్ ద్వారా యూజర్లకు తమకు కావాల్సిన రింగ్ సైజును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఏడు మిల్లీమీటర్లు వ్యాసం ఉండే 5 సైజు వెర్షన్ బరువు 2.3 గ్రాములు కాగా, అన్నిటికంటే పెద్దదైన 13 సైజు బరువు మూడు గ్రాములుగా ఉండనుంది. శాంసంగ్ హెల్త్ ఏఐ ఫీచర్ల ద్వారా హెల్త్ డేటాను కూడా ట్రాక్ చేయవచ్చు. స్లీప్ స్కోర్, స్నోరింగ్‌ను కూడా ఇది ట్రాక్ చేయనుంది. స్లీప్, స్లీప్ లేటెన్సీ, హార్ట్, రెస్పిరేటరీ రేటును ఇది ట్రాక్ చేస్తుంది.
గెలాక్సీ ఏఐతో ఈ రింగ్ డిటైల్డ్ హెల్త్ రిపోర్ట్‌ను అందిస్తుంది. మూడు సెన్సార్ల సిస్టంతో ఇది అందుబాటులోకి రానుంది. ఆప్టికల్ బయో సిగ్నల్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్, యాక్సెలరోమీటర్లు ఇందులో ఉన్నాయి. శాంసంగ్ హెల్త్ యాప్ ద్వారా ఇది పని చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఇది ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది. దీని ఛార్జింగ్ స్టేటస్ తెలిపేందుకు ఎల్ఈడీ లైటింగ్‌ను కూడా అందించనున్నారు.
టైటానియం బిల్డ్‌తో శాంసంగ్ దీన్ని రూపొందించింది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం 10ఏటీయం, ఐపీ68 రేటింగ్స్ కూడా ఈ రింగ్‌లో ఉన్నాయి. నీటిలో 100 మీటర్ల వరకు లోతులో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. జెస్చర్ల ద్వారా ఈ రింగ్ ద్వారా ఫోన్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. అలారం ఆపడం, కెమెరా ఆన్ చేయడం వంటివి దీని ద్వారానే చేయవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?