Netflix vs Amazon: అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్.. ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?
నెట్‌ఫ్లిక్స్ తన ప్లాన్లను తగ్గించడంతో ఇప్పుడు ఓటీటీ రంగంలో పోటీ మరింత ఎక్కువైంది. టాప్-3 ఓటీటీ ప్లాట్‌ఫాం సబ్‌స్క్రిప్షన్లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను భారీగా తగ్గించింది. దీంతో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల ధర రూ.149 నుంచి ప్రారంభం కానుంది. ఏకంగా 60 శాతం వరకు ధరను నెట్‌ఫ్లిక్స్ తగ్గించడం విశేషం. 2016లో మనదేశంలో సేవలు ప్రారంభించిన నాటి నుంచి నెట్‌ఫ్లిక్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. అమెజాన్ ప్రైమ్ ధరలను పెంచిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా ఈ సంవత్సరంలోనే ధరలను రివైజ్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ రూ.149 నుంచి ప్రారంభం కానుంది. ఇంతకుముందు దీని ధర రూ.199గా ఉండేది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో 480పీలో వీడియోలు స్ట్రీమ్ చేయవచ్చు. అయితే రూ.499 బేసిక్ ప్లాన్ ధరను మాత్రం భారీగా తగ్గించారు. ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ.199కే ఈ ప్లాన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, పీసీలు, టీవీల్లో కూడా నెట్‌ఫ్లిక్స్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. రెండు డివైస్‌ల్లో ఒకేసారి కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.
ఇక రూ.649 ప్లాన్ ధరను రూ.499కు తగ్గించారు. దీని ద్వారా కంటెంట్‌ను హెచ్‌డీలో స్ట్రీమ్ చేయవచ్చు. ఇక అన్నిటి కంటే ఖరీదైన రూ.799 ప్లాన్ ధరను రూ.649కు తగ్గించారు. దీని ద్వారా 4K+HDRలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. నాలుగు వేర్వేరు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది.
అమెజాన్ ప్రైమ్ రివైజ్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు
అమెజాన్ ప్రైమ్ రివైజ్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ డిసెంబర్ 13వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ.129 నెలవారీ ప్లాన్ ధరను రూ.179కి పెంచారు. ఇక రూ.329 త్రైమాసిక ప్లాన్ ధరను రూ.459కు, రూ.999 వార్షిక ప్లాన్‌ను రూ.1,499కు పెంచారు.
డిస్నీప్లస్ హాట్‌స్టార్ రివైజ్డ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా ప్లాన్లను రివైజ్ చేసింది. రూ.499 మొబైల్ ప్లాన్, రూ.899 సూపర్ ప్లాన్, రూ.1,499 ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రీమియం ప్లాన్ తీసుకుంటే నాలుగు డివైస్‌ల్లో 4కేలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. ఇక సూపర్ వినియోగదారులు రెండు డివైస్‌ల్లో కంటెంట్ స్ట్రీమ్ చేయవచ్చు. అయితే వీడియో క్వాలిటీ హెచ్‌డీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇక మొబైల్ ప్లాన్ తీసుకుంటే కేవలం ఒక్క మొబైల్ డివైస్‌లో మాత్రమే స్ట్రీమ్ చేయవచ్చు.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!