Virat Kohli Test Records: ఈ రికార్డులు ఎవరైనా కొడతారా.. మళ్లీ తనే ట్రై చేయాలా..విరాట్ తిరుగులేని కెప్టెన్సీ రికార్డులు!
అత్యంత విజయవంతమైన భారతీయ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
విరాట్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. గత సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్‌కప్ సమయంలో అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్‌ను తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించింది. అయితే ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ అధికారికంగా ప్రకటించాడు.
భారతీయ టెస్టు క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్ తనే. మొత్తంగా 68 టెస్టులకు కెప్టెన్సీ చేస్తే 40 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఓటములు కేవలం 17 మాత్రమే. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లోనే.. అది కూడా ఆస్ట్రేలియాలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించాడు. 1975లో గ్రెగ్ చాపెల్ తర్వాత కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసింది విరాట్ కోహ్లీ మాత్రమే.
టీమిండియా తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించింది, ఎక్కువ విజయాలు అందించింది కూడా విరాట్ కోహ్లీనే. ప్రపంచం మొత్తమ్మీద అత్యధిక టెస్టు విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్ కోహ్లీ. 53 విజయాలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మొదటి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు. కెప్టెన్‌గా కోహ్లీ విజయాల శాతం 58.82గా ఉంది.
అత్యధిక విజయాల శాతం ఉన్న కెప్టెన్లలో కూడా విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా (71.93 శాతం), డాన్ బ్రాడ్‌మన్ (62.50 శాతం), రికీ పాంటింగ్ (62.34 శాతం) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వీరు ముగ్గురూ ఆస్ట్రేలియన్లే. ఆస్ట్రేలియన్ కెప్టెన్ల తర్వాత అత్యంత విజయవంతం అయిన కెప్టెన్ కేవలం విరాట్ మాత్రమే.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మొత్తం 113 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 5,864 పరుగులు చేయగా.. సగటు 54.80గా ఉంది. ఇందులో 20 సెంచరీలు, 18 అర్థ సెంచరీలు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ కెప్టెన్/ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే. 2014-15లో ఆస్ట్రేలియాతో, ఆస్ట్రేలియాలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ ఏకంగా 692 పరుగులు సాధించాడు. ఆ సిరీస్‌లో విరాట్ సగటు 86.5 కాగా.. నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి.
తన కెప్టెన్సీలో ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ తర్వాత టీమిండియాను ఎవరు నడిపిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. విరాట్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండో టెస్టుకు కెప్టెన్సీ వహించాడు. మరి తనకే కెప్టెన్సీ కట్టబెడతారా? లేకపోతే రోహిత్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ
Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!
Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే