T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘోరంగా విఫలం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.
2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రస్థానం ముగిసింది. అత్యంత సులభంగా సెమీస్‌కు చేరుకుంటారని అందరూ అంచనా వేసిన టీమిండియా సూపర్-12తోనే సరిపెట్టుకుంది. గ్రూప్-2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ నాలుగేసి విజయాలతో సెమీస్ విజయాన్ని ఖరారు చేసుకున్నాయి. భారత్‌కు నమీబియాతో, పాకిస్తాన్‌కు స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లు ఉన్నప్పటికీ అవి నామమాత్రమే. ఈ వరల్డ్ కప్‌లో భారత్ విఫలం అవ్వడానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే..
1. అవసరం అయినప్పుడు టాస్ గెలవకపోవడం
సాధారణంగా కోహ్లీ టాస్ విషయంలో వీక్. గతంలో కూడా అనేకసార్లు ఈ విషయం ప్రూవ్ అయింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే.. అందులో మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ టాస్ ఓడిపోయాడు. కేవలం స్కాట్లాండ్ మ్యాచ్‌లో మాత్రమే టీమిండియా టాస్ గెలిచింది. కీలకమైన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో, కష్టమైన దుబాయ్ పిచ్ మీద కోహ్లీ టాస్ ఓడిపోవడం ఆ మ్యాచ్ ఫలితాలను ఎంతగానో ప్రభావితం చేసింది.
2. కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ వైఫల్యం
పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఎంత కీలకమైనవో క్రికెట్ మీద అవగాహన ఉన్న ఎవరైనా చెప్తారు. అలాంటి మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలం కావడంతో ఆటోమేటిక్‌గా భారీ స్కోర్లు రాలేదు. ముఖ్యంగా ఓపెనర్ల వైఫల్యం కూడా భారత్ అవకాశాలను ప్రభావితం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లిద్దరూ కలిసి మూడు పరుగులు మాత్రమే చేశారు. తర్వాత న్యూజిలాండ్ మీద కూడా ఎక్కువ పరుగులు చేయలేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్‌ల మీద చెలరేగి ఆడినా.. అప్పటికే చాలా ఆలస్యం అయింది.
3. బౌలర్ల వైఫల్యం కూడా..
మొదటి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు మాత్రమే కాదు. బౌలర్లు కూడా దారుణంగా విఫలం అయ్యారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో మొత్తం మీద కేవలం 2 వికెట్లను మాత్రమే భారత బౌలర్లు దక్కించుకోగలిగారు. ఈ రెండు వికెట్లు కూడా న్యూజిలాండ్ మ్యాచ్‌లోనే వచ్చాయి. వాటిని కూడా బుమ్రా ఒక్కడే తీయడం.. బౌలింగ్ ఆర్డర్ ఎంత ఘోరంగా విఫలం అయిందో చెబుతోంది.
4. మంచే ముంచింది
ఈ టీ20 వరల్డ్‌కప్‌లో రాత్రి పూట జరిగిన మ్యాచ్‌ల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. సాయంత్రం జరిగే మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు అస్సలు బంతిపై పట్టు దొరకడమే కష్టం అవుతోంది. క్యాచ్‌లు జారిపోవడం, మిస్ ఫీల్డ్‌ల కారణంగా బౌండరీలు రావడం వంటి అనర్థాలు కూడా ఉన్నాయి. భారత్ మ్యాచ్‌లకు వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంటుందని.. మన జట్టు మ్యాచ్‌లన్నీ రాత్రికి షెడ్యూల్ చేశారు. దీంతో టాస్ ఓడినప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అవకాశాలు తగ్గిపోయాయి.
5. ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి
ఈ టోర్నీలో భారత ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఐపీఎల్ ప్రారంభం అయిన దగ్గరి నుంచి భారత్ జట్టు ఆటగాళ్లు పూర్తిగా బయోబబుల్‌లోనే ఉన్నారు. సగంలో ఆగిపోయిన ఐపీఎల్, ఆ తర్వాత ఇంగ్లండ్, శ్రీలంక పర్యటనలు, మళ్లీ వెంటనే ఐపీఎల్ రెండో దశతో పూర్తిగా అలసిపోయారు. దీనికి తోడు బయో బబుల్ కారణంగా కుటుంబానికి, బాహ్య ప్రపంచానికి దూరంగా గడపాల్సి రావడంతో ఎంతో ఒత్తిడి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద ఒత్తిడికి చిత్తవడంతో న్యూజిలాండ్ మీద మ్యాచ్‌లో పూర్తి అపనమ్మకంతో ఆడినట్లు కనిపించింది.
ఓడిపోవడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా.. ఎన్ని ఓటములు ఎదురైనా.. అల్టిమేట్‌గా విజయమే మాట్లాడాలి. సంవత్సరం తిరగక ముందే ఆస్ట్రేలియాలో ఇంకో వరల్డ్ కప్ కూడా జరగనుంది. కాబట్టి ఆ కప్‌లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరిచి కప్ కొట్టాలని ఆశిద్దాం..