PV Sindhu In Quarter Final: దూసుకెళ్తున్న పీవీ సింధు.. క్వార్టర్స్ లోకి ప్రవేశం.. వరుస గేమ్ ల్లో ప్రత్యర్థి చిత్తు
తనకెంతో అచ్చొచ్చిన ఇండియా ఓపెన్లో పీవీ సింధు దూసుకు పోతుంది. తాజాగా ఆమె క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. క్వార్టర్స్ లో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మారిస్కాతో తలపడనుంది.

India Open News: కొత్త సంవత్సరంలో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు దూకుడు ప్రదర్శిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ లో సత్తా చాటుతోంది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ లో మాజీ ప్రపంచ నెంబర్ వన్, సింధు 21-15, 21-13తో వరుస గేమ్ ల్లో జపాన్ కు చెందిన మానమి సూజును ఓడించింది. అక్టోబర్ తర్వాత ఒక మేజర్ టోర్నీ క్వార్టర్స్ కు చేరడం సింధుకు ఇదే తొలిసారి కావడం విశేషం. గత నవంబర్ లో సూపర్ 300 టోర్నీ అయిన సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మలేసియా ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు నేరుగా ఇండియా ఓపెన్ లోనే బరిలోకి దిగింది.
46 నిమిషాల్లోనే..
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను సింధు కేవలం 46 నిమిషాల్లోనే ముగించింది. ఆది నుంచే బలమైన షాట్లు ఆడుతూ, నెట్ వద్ద చురుకగా షాట్లు ఆడింది. అలాగే తన మార్కు క్రాస్ కోర్టు షాట్లతోపాటు బలమైన స్మాష్ లతో సింధు విరుచుకు పడింది. దీంతో జపాన్ ప్లేయర్ వద్ద సమాధానం లేక పోయింది. తొలుత తొలి గేమ్ ను ఈజీగానే దక్కించుకున్న సింధు.. తర్వాతి గేమ్ ను అంతకంటే తేలికగా సాధించుకుని విజయం సాధించింది. సూజుతో ఆడటం తనకిదే తొలిసారని, ఈ గేమ్ లో తను బాగా ఆడిందని సింధు పేర్కొంది. ఇద్దరి మధ్య కొన్నిసార్లు లాంగ్ ర్యాలీలు కూడా జరిగాయని గుర్తు చేసింది. ఈ విజయం ఇచ్చిన ధీమాతో శుక్రవారం జరగబోయే క్వార్టర్స్ మ్యాచ్ కు సిద్ధం అవుతానని రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు పేర్కొంది. ఇక తొలి రౌండ్ లో తైవాన్ కు చెందిన షో యున్ సంగ్ ను కూడా వరుస గేమ్ ల్లో ఓడించి సత్తా చాటింది.
కఠినమైన ప్రత్యర్థి..
ఇక క్వార్టర్స్ లో సింధుకు కఠినమైన ప్రత్యర్థి ఎదురైంది. నాలుగో సీడ్ గ్రెగోరియా మారిస్కా (ఇండోనేసియా)తో సింధు తలపడనుంది. ఇప్పటివరకు ముఖాముఖిగా 13 సార్లు ఇరువురు ప్లేయర్లు తలపడగా, సింధు 10 సార్లు గెలిచి పై చేయి సాధించింది. అయినా, ప్రత్యర్థిని తేలికగా తీసుకోకూడదని సింధు భావిస్తోంది. గతేడాది డెన్మార్క్ ఓపెన్లో మూడు గేమ్ ల పాటు జరిగిన మ్యాచ్ లో ఈ ఇండోనేసియా షట్లర్ చేతిలోనే సింధు ఓడిపోయింది. దీంతో శుక్రవారానికి సంబంధించి బలమైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని భావిస్తోంది. రేపటి మ్యాచ్ లో తన వందశాతం ప్రదర్శనను కనబరుస్తానని సింధు పేర్కొంది.
మరోవైపు పురుషుల విభాగంలో కిరణ్ జార్జి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. అయితే స్టార్లు లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాంశు రజావత్ లు తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ లో సహచర ప్లేయర్ రక్షిత శ్రీ సంతోష్ ను ఓడించిన అనుపమ ఉపాధ్యాయ ప్రిక్వార్టర్స్ కు చేరుకుంది. అయితే ప్రిక్వార్టర్స్ లో ప్రపంచ 11వ ర్యాంకర్, మియాజకి చేతిలో 6-21, 9-21తో అనుపమ చిత్తుగా ఓడిపోయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

